వాటాల కోసం వార్ | War for shares | Sakshi
Sakshi News home page

వాటాల కోసం వార్

Published Mon, Jul 11 2016 1:53 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

అధికారపార్టీలోని రేషన్ ‘మాఫియా’ల మధ్య చిచ్చు రేగుతోంది.. వాటాల్లో తేడాలు..

అధికారపార్టీలోని రేషన్ ‘మాఫియా’ల మధ్య చిచ్చు రేగుతోంది.. వాటాల్లో తేడాలు.. హద్దుల వివాదాలతో తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా మారి దాడులు చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల భార్యలు, తనయులకు నెలవారీ మామూళ్లు కడుతూ దందా సాగిస్తున్నారు.. ఒక్కనెల మామూళ్లు చెల్లించకపోయినా ఒప్పుకోరు.. దాడులకు సైతం వెనకాడటంలేదు.. .

 

గుంటూరు : టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఇసుక, చౌక బియ్యం అక్రమ రవాణాకు అధికార పార్టీ ముఖ్య నేతలు, వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులే అండదండలు అందిస్తున్నారు. జిల్లాలో రేషన్ మాఫియాలు రాజ్యాంగేతరశక్తులుగా మారి డబ్బు ఆశ చూపి పోలీస్ అధికారులను సైతం  రొంపిలోకి లాగుతున్నట్లు విమర్శలున్నాయి. వారి ద్వారానే చౌక బియ్యం లారీలను జిల్లా దాటిస్తున్న విషయాలూ వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చౌక బియ్యం అందించకుండా లారీలకు లారీలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో బియ్యం మాఫీయాకు ఓ మంత్రి భార్య, ఓ ముఖ్యనేత తనయుడు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల అండదండలు ఉండటంతో వారు మరింతగా రెచ్చిపోయి చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంతో అధికార పార్టీ చోటా నాయకులు రూ.లక్షలు సంపాదిస్తుంటే వారికి వెన్నుదన్నుగా నిలిచిన ముఖ్య నేతలు మాత్రం కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, తెనాలి డివిజన్‌లలో రేషన్ మాఫియా జూలు విదుల్చుతోంది.


బెదిరించి డబ్బు వసూలు
మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో నరసరావుపేటలో రేషన్ మాఫియాకు చెందిన ఓ ఎస్సీ నేతను సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు ఎత్తుకెళ్లిన ముఖ్యనేత తనయుడు పోలీసుల సాయంతో బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినుకొండ పట్టణంలో రేషన్ మాఫియా ముఠాల మధ్య వాటాలు, హద్దుల వివాదంతో తెలుగు తమ్ముళ్లు ఆదివారం తన్నులాటకు దిగారు.. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో రేషన్ మాఫియాను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు..

 
మామూళ్ల మత్తులో అధికారులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణలు నిర్వహించడం మినహా ఇసుక, బియ్యం, కిరోసిన్ అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా చుట్టూ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో అయితే రేషన్ దుకాణాల్లో సగం మందికి కూడా చౌక బియ్యం అందడం లేదు. కొందరైతే నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూట్ ఆఫీసర్ల నుంచి సివిల్ సప్లైస్, పోలీస్ అధికారుల వరకూ ప్రతి ఒక్కరికీ నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టి సారించి నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement