సాక్షి, కడప : ఎట్టకేలకు జిల్లాలో ఆగిపోయిన 21 సొసైటీలకు డిసెంబరులో ఎన్నికలు నిర్వహించేందుకు సహకార అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సహాయ మార్కెటింగ్ ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు ప్రతి సొసైటీకి పాలకవర్గం తప్పక ఏర్పాటు చేయాలని ఈనెల 19న ఆదేశించారు. ఈ మేరకు ఆగిపోయిన సొసైటీలకు ఎన్నికలు నిర్వహించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి.
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో గతంలో ఎటూ గెలువలేమనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీకి ఆధిక్యం ఉన్న 21 సొసైటీలకు శాంతిభద్రతల సాకు చూపుతూ ప్రభుత్వం వాయిదా వేసింది. ఎన్నికలు పూర్తి కావడంతో మళ్లీ సొసైటీలకు ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచే ప్రక్రియ ప్రారంభించి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని నామినేషన్ల దశలో, మరికొన్ని ఉపసంహరణ సమయంలో కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఎన్నికలు జరిగే సొసైటీలు ఇవే!
జిల్లాలో సొసైటీలకు సంబంధించి గతంలో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 77 సొసైటీలు ఉండగా, మొదటి దశలో 12, రెండవ దశలో 9 వాయిదా పడ్డాయి. మొదటి దశలో పెనగలూరు, అనంతసముద్రం, అనంతయ్యగారిపల్లె, నందలూరు, అల్లాడుపల్లె, కె.అగ్రహారం, నాగిరెడ్డిపల్లె, వల్లూరు, గోనమాకులపల్లె, వెల్లటూరు, మన్నూరు, పి.టంగుటూరు ఉన్నాయి. రెండవ దశలో బి.కోడూరు,చిన్నకేశంపల్లె, వీరబల్లి, కొలిమివాండ్లపల్లె, మద్దిరేవుల, గొర్లముదివీడు, దిగువగొట్టివీడు ఉన్నాయి. సకాలంలో ఓటర్ల జాబితా అందలేదనే కారణంతో అప్పట్లో బ్రాహ్మణపల్లె సొసైటీ ఎన్నిక వాయిదా పడింది. వీటన్నింటికీ డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయి.
జూన్‌లో జరగాల్సిన ఎన్నికలు
ప్రభుత్వం శాంతిభద్రతలతోపాటు వివిధ కారణాల సాకుతో గతంలో ఎన్నికలను వాయిదా వేసింది. అయితే జూన్ నెలలోనే ప్రభుత్వం అన్ని సొసైటీలపై స్టేలను తొలగించి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు ఎన్నికలు జరిపేందుకు ఫైలును సిద్ధం చేసి సహకార అధికారులు కలెక్టర్‌కు పంపారు. జులై 10న ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.
అయితే, వాయిదా పడిన సొసైటీలకు సంబంధించి వాటిని ఏ జీఓలు, ఏ కారణాలతో వాయిదా వేశారో స్పష్టంగా తెలుపాలంటూ ఫైలుపై కలెక్టర్ రిమార్కులు రాసి వెనక్కి పంపారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు రావడం, మళ్లీ సమైక్య ఉద్యమం వంటి కారణాలతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
ఫైలు సిద్ధం
సొసైటీ ఎన్నికల వాయిదాకు సంబంధించిన కారణాలను డీసీఓ ఇప్పటికే కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డీసీఎల్‌ఓల నుంచి సమాచారం తెప్పించారు. వాయిదా పడటానికి కారణమైన జీఓలను పొందుపరిచి జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు నివేదించేందుకు సహకార అధికారులు ఫైలును సిద్ధం చేశారు. కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపి తేదీలను ప్రకటిస్తే ఆ మేరకు ఎన్నికలు జరిపేందుకు సహకార అధికారులు రెడీ అవుతున్నారు.
ఈనెల 26వ తేది వరకు రచ్చబండ ఉండటంతో డిసెంబరులోనే ఎన్నికలు జరుగుతాయని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతోపాటు డెరైక్టర్ల ఎంపికలు పూర్తి కావడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు వైఎస్సార్ సీపీ ఆధిక్యం దాదాపు అన్ని సొసైటీల్లో ఉండటంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం లేకపోలేదు.
త్వరలో ఎన్నికలు నిర్వహిస్తాం
ఆగిపోయిన సొసైటీలకు సంబంధించి ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ అనుమతి ఇచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. దీనికి సంబంధించి ఫైలును కూడా సిద్ధం చేశాం. కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపి తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.
- చంద్రశేఖర్, సహకారశాఖాధికారి
సహకార సమరానికి సన్నాహం
Published Fri, Nov 22 2013 2:21 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement