ఎన్నికల ఏరు దాటేందుకు ప్రజలకు ఎన్నో వరాలిచ్చిన చంద్రబాబు సర్కారు.. ఒడ్డు చేరిన తరువాత హామీలను ఏట్లో ముంచేసింది. రుణమాఫీ సందడిలో వడ్డీలేని రుణాల రాయితీలిచ్చే విషయంలో ప్రభుత్వం తాజాగా మొండిచేయి చూపింది. రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలు, రూ.3 లక్షలలోపు పావలా వడ్డీ రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ విడుదల చేయకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పరిస్థితుల నడుమ ఖరీఫ్ పంటలు వేసేందుకు అన్నదాతలు సమాత్తమవుతున్నారు. బ్యాంకులు వ్యవసాయ రుణ లక్ష్యాలను భారీగానే చూపిస్తున్నా.. రైతులకు ఏమేరకు నిధులు విదులుస్తాయనేది ప్రశ్నార్థకంగానే ఉంది. జిల్లాలోని వాణిజ్య బ్యాంకులు రూ.4,608 కోట్లను రైతులకు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించగా, రూ.600 కోట్లు రుణాలిస్తామని డీసీసీబీ చెబుతోంది. రుణమాఫీ ప్రకటన నేపథ్యంలో బకాయిలు చెల్లించని రైతులకు మాత్రం రుణాలిచ్చేది లేదని బ్యాంకులన్నీ తెగేసి చెబుతున్నాయి.
ఏలూరు (టూ టౌన్) : వర్షాలు పలకరించడంతో రైతులు నారుమళ్లు పోసేందుకు సిద్ధమయ్యారు. వారికి ఏ మేరకు రుణాలివ్వాలనే అంశంపై బ్యాంకులు మండల స్థాయి నుంచీ నివేదికలు సిద్ధం చేశాయి. జిల్లాలో ఖరీఫ్ పంటలు వేసే అన్నదాత లకు రూ.5,208 కోట్లు రుణాలుగా ఇవ్వాలని బ్యాం కులు నిర్ణయించాయి. ఇందులో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వాటా రూ.600 కోట్లు కాగా, వాణిజ్య బ్యాంకులు రూ.4,608 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరికి ఎకరానికి రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాయి.
రుణమాఫీ నేపథ్యంలో వడ్డీలేని రుణాల రాయితీలకు ప్రభుత్వం తాజాగా మొండిచేయి చూపింది. రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలు, రూ.3 లక్షలలోపు పావలా వడ్డీ రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. అయితే, రుణమాఫీ కారణంగా బకాయిలు చెల్లించని రైతులకు రుణాలిచ్చేది బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష్యాలను భారీగానే చూపిస్తున్నా.. అన్నదాతలకు ఏమేరకు రుణాలిస్తారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఖరీఫ్ రుణ లక్ష్యాలపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీసీబీ సీఈవో ఫణికుమార్ ఏమంటున్నారంటే..
గత ఏడాది మాదిరిగానే..
ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని 407 వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,608 కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. గత సంవత్సరం సుమారు 3 లక్షల మంది రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతోపాటు వ్యవసాయ అనుంబంధ రంగ రుణాలు కూడా ఇచ్చాం. ఈ ఏడాది కూడా అదే పద్ధతిలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో రూ.7,865 కోట్లను రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, రూ.4,300 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాం. వాణిజ్యం బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మరణించిన రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్
రూ.600 కోట్లు ఇస్తాం
ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని 34 డీసీసీబీ శాఖల ద్వారా 257 సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.600 కోట్లను రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించాం. గత సంవత్సరం కూడా ఇంతే మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ రైతులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో పూర్తిస్థాయిలో రుణాలు అందించలేకపోయాం. రుణమాఫీ అమలవుతుందన్న ఉద్దేశంతో రైతులు వడ్డీలు కట్టలేదు. రెండు విడతలుగా రుణమాఫీ అమలు కావడంతో అర్హులైన రైతులందరికీ సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. 2లక్షల 3 వేల మంది రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాది మాదిరిగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వరికి రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.20 వేలు ఇస్తాం. గత ఖరీఫ్‌లో బకాయిలు చెల్లించని రైతులకు మాత్రం రుణాలు ఇచ్చేది లేదు. గ్రామ స్థాయిలో సహకార సంఘాల కార్యదర్శులు రైతులు ఏఏ పంటలు వేస్తున్నారనే దానిపై వీఆర్వోల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని ఆ మేరకు మాత్రమే రుణాల మంజూరుకు సిఫారసు చేయాలి.
- వీవీఎస్ ఫణికుమార్, సీఈవో, డీసీసీబీ
రుణమిస్తారా!
Published Thu, Jun 11 2015 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement