పట్టిసం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గడంతో బయట పడుతున్న ఇసుక మేటలు
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: గోదావరి నీటి మట్టం తగ్గుతుండటంతో ఇసుక మేటలు బయట పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పై భాగాన అడ్డుకట్టలు వేసి కొంత వరకు తూరల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు దిగువ నుంచి పట్టిసీమ వరకు చిన్న పాయలా నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో కూడా పలు చోట్ల ఇసుక మేటలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో గోదావరి నీటి ప్రవాహం ఎంత వరకు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.
మిగిలిపోయిన వాటర్ ప్యాకెట్లు
మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు తాగునీరు పంపిణీ కోసం తీసుకువచ్చిన వాటర్ ప్యాకెట్‌లు పట్టిసం రేవులోనే ఉండిపోయాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు తాగునీటి సమస్య ఉండకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో భక్తులకు అందించేందకు వాటర్ ప్యాకెట్ల బస్తాలను ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకల్లో వాటర్ ప్యాకెట్ల వినియోగం లేకపోవడంతో, అలాగే ప్యాకెట్లను సరిగా పంపిణీ చేసే వారు లేకపోవడంతో ఈ బస్తాలు అక్కడే ఉండి పోయాయి. కనీసం వీటి గురించి పట్టించుకునే నాథుడు కూడా లేడు. ఎండ తీవ్రతకు వాటర్ ప్యాకెట్ బస్తాలు దెబ్బతినే పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
శివక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు
పట్టిసం శివక్షేత్రానికి బుధవారం కూడా భక్తులు తరలి వచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో శివక్షేత్రాన్ని దర్శించుకోలేక వెనుదిరిగిన వారితో పాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలు కూడా శివక్షేత్రానికి చేరుకుని గోదావరిలో స్నానమాచరించి శ్రీభద్రకాళీసమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment