
విజ్జేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి భారీగా విడుదల చేస్తున్న గోదావరి వరద నీరు
నిడదవోలు: గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం నుంచి నీటి మట్టాలు నిలకడగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం 10.80 అడుగుల నీటి మట్టం నమోదు కాగా, గురువారం సాయంత్రం 6 గంటలకు 10.90 అడుగులకు పెరిగింది. భద్రాచలం వద్ద బుధవారం 16.50 అడుగుల నీటి మట్టం నమోదవగా గురువారం సాయంత్రం 6 గంటలకు 17.60 అడుగులకు పెరిగింది. ఏటా ఆగస్టు 10 నుంచి 30వ తేదీలోపు గోదావరికి వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహన్‌రావు చెప్పారు. ప్రస్తుతం ప్రమాదకరంగా వరద నీరు వచ్చి చేరే సంకేతాలు లేవన్నారు.
గతేడాది ఇదే సమయంలో సముద్రంలోకి రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదిలామన్నారు. అయినప్పుటికి వరదలు వచ్చినా ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. విజ్జేశ్వరం నుండి దవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామరŠాధ్యనికి దృష్టిలో పెట్టుకుని మిగులు జలాలను ధవళేశ్వరం జలవనరుల శాఖ హెడ్‌వరŠస్క్ అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాటన్ బ్యారేజిల 175 గేట్లను ఎత్తి గురువారం 88,965 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13.99 మీటర్లుగా కొనసాగుతోంది.
కాలువలకు నీటి విడుదల తగ్గింపు
ఉభయగోదావరి జిల్లాలలో మూడు డెల్టాలకు రైతుల వ్యవసాయ అవసరాల మేరకు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. పశ్చిమడెల్టాకు 4వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1850 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 737 క్యూసెక్కులు, ఉండి కాలువకు 650 క్యూసెక్కులు, తణుకు కాలువకు 506 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 385 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 1704 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.