
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర.. పోలవరం అంచనా వ్యయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ సానుకూల ధోరణిలో స్పందించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదించిన వ్యయం 55,548.87కోట్ల రూపాయలని అధికారికంగా ప్రకటన జారీచేసింది. జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంవత్సర సమీక్షలో శనివారం వెల్లడించింది. గతంలో టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 2014 ధరల ప్రకారం చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇచ్చి ప్రాజెక్టు వ్యయంపై పూర్తి నివేదికను సమర్పించింది.
ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం..
సవరించిన అంచనాలను ఆమోదించాలని ఇటీవల హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి సీఎం జగన్ కోరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సవరించిన వ్యయ అంచనాలు –2 (ఆర్‌సీఈ) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కోసం అయ్యే రూ.55,656 కోట్ల వ్యయాన్ని ఆమోదించాలని విన్నవించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1,779 కోట్ల మేర రీయింబర్స్ చేయాల్సి ఉందని, 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇదే విషయంపై రాష్ట్ర అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సైతం పలుమార్లు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులకు వినతిపత్రాలను సమర్పించారు. (సవరించిన వ్యయ అంచనాల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వండి)
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం.. తాజా అధికారిక ప్రకటనలో 2017-18 ధరల ప్రకారం కేంద్రం ఆమోదించిన వ్యయం 55,548.87కోట్ల రూపాయలని వెల్లడించింది. ప్రాజెక్టుకు ఇప్పటివరకు 8614.16 కోట్ల రూపాయలు విడుదల చేయగా.. త్వరలోనే మరో 2234 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం 17,325 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల పోలవరం పనులన్నీ నిశితంగా పరిశీలించి.. 2021 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను ఆమోదించడంతో పోలవరం నిర్మాణం మరింత వేగవంతం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment