కర్నూలు(కలెక్టరేట్/రూరల్), న్యూస్‌లైన్: కాల్వల కింద రబీ పంటల సాగుపై రైతన్న ఆశలను ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీరుగార్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా, నదులు భారీగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు నిండినా రబీ పంటలకు అత్తెసరు నీటితో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతు ప్రయోజనాలపై చర్చించింది నామమాత్రమే అయినా.. వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులు నీటి పారుదల శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రులతో కలిసి ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
ఎల్లెల్సీ నీటి విడుదలపై సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న నీటి చౌర్యంపై ఎల్లెల్సీ నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు పి.సాయిబాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లెల్సీ కింద కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో మిరప, పత్తి లక్ష ఎకరాల్లో ఉందని, ఈ పంటలకు విధిగా డిసెంబర్ 15 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుబాటులోని నీటితో మంచినీటి అవసరాలు తీరుస్తూ ఇప్పటికే వేసిన 50వేల ఎకరాల పంటలకు నీరిచ్చేందుకు మంత్రులు, అధికారులు అంగీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హెచ్‌ఎల్‌సీ నీటిని వాటా మేరకు రాబట్టుకుంటున్నారని, మన జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కోటా మేరకు నీటిని రాబట్టలేకపోతున్నారని.. ఇది చేతగాని తనమేనని సాయిబాబు తదితరులు ఘాటుగా విమర్శించారు.
దీనిపై మంత్రి ఏరాసు స్పందిస్తూ ‘‘మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో చర్చించాం. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ముగ్గురు, రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇందువల్ల న్యాయం పొందలేకపోతున్నాం’ అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంకు కూడా ఇదే విషయమే ప్రధానంగా చెప్పామని తెలిపారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే ఉన్నా వెలుగోడు రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంలో పూర్తిగా నీరున్నా మన ప్రాంతానికి 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామన్నారు. ఎస్సార్బీసీ సర్కిల్-1 ఎస్‌ఈ, ఈఈ, హంద్రీనీవా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము పని లేక ఇక్కడికి వచ్చామా అంటూ గైర్హాజరైన వారికి చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రులు టీజీ, ఏరాసులు కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి టీజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు రూ.530 కోట్లు నిధులున్నాయని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వీటి ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ సీఈ సుబ్బారావు, ఎస్‌ఈ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, జీడీపీ తదితరులు పాల్గొన్నారు.
రబీ ఆశలపై నీళ్లు
Published Wed, Nov 27 2013 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement
Advertisement