
నీటి యాతన
నగర జనాభా 6.5 లక్షలు ఉంటుంది. నగర పాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల జనాభా 1.5 లక్షలు ఉంటుంది.
వేసవికి ముందే తాగునీటి తిప్పలు గుంటూరు నగరం గొంతెండుతోంది
నిలిచిన గుంటూరు చానల్ సరఫరా శివారు ప్రాంతాలకు అరకొర నీటి సరఫరా
వేసవిపై దృష్టిసారించని ఉన్నతాధికారులు
గుంటూరు: నగర జనాభా 6.5 లక్షలు ఉంటుంది. నగర పాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల జనాభా 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం కలిపి 8 లక్షల జనాభా. అయితే ఈ జనాభాకు ప్రతిరోజూ 120 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నగరానికి కృష్ణానది నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి గుంటూరు చానల్ నుంచి తక్కెళ్ళపాడు మంచినీటి కేంద్రానికి అక్కడి నుంచి నగరానికి మంచినీటిని సరఫరా చేస్తారు. రెండు పైపులైన్ల ద్వారా 90 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే సంగం జాగర్లమూడి నుంచి 27 ఎంఎల్‌డీల నీరు, వెంగళాయపాలెం ద్వారా 3 ఎంఎల్‌డీల నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడడంతో గుంటూరు చానల్ ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి వద్ద ఉన్న పంపింగ్ కేంద్రం ద్వారా మంగళగిరి పంపింగ్ కేంద్రం మీదుగా ప్రతిరోజూ 40 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేస్తున్నారు. సంగం జాగర్లమూడి నుంచి 16 ఎంఎల్‌డీల నీరు, వెంగళాయపాలెం ద్వారా 3 ఎంఎల్‌డీల నీరు మొత్తం 59 ఎంఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో ప్రజలకు మంచినీటి సమస్యలు తప్పడం లేదు. అదే సమయంలో విలీనగ్రామాలైన గోరంట్ల, బుడంపాడు, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, పొత్తూరు గ్రామాల్లో చెరువులు పూర్తిస్థాయిలో నింపలేదు. దీంతో ఆయా గ్రామాల్లో సైతం తీవ్ర నీటి సమస్య నెలకొంది.
గుంటూరు చానల్‌కు క్రాస్‌బండ ...
వాస్తవానికి నగరంలో ప్రతి వేసవిలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు నీటి సమస్య ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గుంటూరు చానల్‌కు క్రాస్‌బండ ఏర్పాటు చేసి 5 అడుగుల మేర నీటిని స్టోరేజ్ చేసి ప్రజలకు సరఫరా చేస్తారు. అయితే గత ఏడాది నవంబర్ నుంచే కృష్ణానదిలో నీటి సమస్య ఏర్పడడంతో అధికారులు గుంటూరు చానల్‌కు క్రాస్‌బండ పనులు పూర్తిచేస్తున్నారు. ఐదు అడుగుల మేర నీటిని నిల్వ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మరోవైపు తెనాలి పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్‌కు నగరానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్‌ను అనుసంధానం చేయడం ద్వారా నగరంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలు ...
నగరంలోని మంగళదాస్‌నగర్, శ్రీనగర్, పాతగుంటూరు, రైలుపేట, కొత్తపేట, ఆర్టీసీ కాలనీ, కొరిటెపాడు, ఆంజనేయ కాలనీ, శ్యామలానగర్, ఇలా అనేక ప్రాంతాల్లోని ప్రజలు నెల రోజులుగా మంచి నీటి కోసం నరకయాతన పడుతున్నారు. నిత్యం నీటి కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి.ఏ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేటలోని గణేశ్వరరావువీధి, మంగళబావి సందు, గరువు ప్రాంతాల్లో సంవత్సరం నుంచి నీరు సక్రమంగా సరఫరా కావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాతగుంటూరు పరిధిలోని సుద్దపల్లిడొంక, లక్ష్మీనగర్, పాములకాలనీ, ప్రగతినగర్ ప్రాంతాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వీధి కుళాయిల వద్ద తెల్లవారు జాము నుండే బిందెలతో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. నందివెలుగు రోడ్డులోని వినోభానగర్, రాహుల్‌గాంధీనగర్, ఆర్టీసీ కాలనీ శివార్లులోనూ నీటి ఎద్దడి తలెత్తుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు సైతం డబ్బులు వెచ్చించి మరీ తాగునీటిని కోనుగోలు చేయాల్సిన దుస్థితిని నగరపాలక సంస్థ అధికారులు ఏర్పరిచారని దుయ్యబడుతున్నారు.