హైకోర్టు నోటీసులు బాబుకు చెంపపెట్టు
►సామాజికవేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా.రాజేంద్రసింగ్
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలోని కృష్ణానది కరకట్ట లోపల అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయలేదో చెప్పాలని హైకోర్టు నోటీసులు జారీచేయడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా.రాజేంద్రసింగ్ చెప్పారు. ఆయన బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటని ధ్వజమెత్తారు. నదులను పరిరక్షించాలి.. అంటూ అందరిచే ప్రతిజ్ఞలు చేయిస్తున్న చంద్రబాబు చేతల్లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కరకట్టపై అక్రమ కట్టడాలను తొలగించాలని గతంలో డిమాండ్‌చేసిన ముఖ్యమంత్రే ఇప్పుడు వాటినే ఆవాసాలుగా చేసుకున్నారని విమర్శించారు. రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్న చంద్రబాబు నీతిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అక్రమ కట్టడాల విషయంలో హైకోర్టు స్పందించి నోటీసులు జారీచేయడం నదికి ప్రాణంపోయడం వంటిదని ఆయన అభివర్ణించారు. చంద్రబాబు అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ద్వంద్వ నీతి ఎల్లవేళలా సాగదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని అక్రమ కట్టడాలను తొలగించాలని రాజేంద్రసింగ్ డిమాండ్ చేశారు.