హైదరాబాద్ :ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోస్ తెలిపారు. పాలెం బస్సు సంఘటనను దృష్టిలో పెట్టుకుని వేధిస్తున్న కారణంగా ఇంతకన్నా ప్రత్యామ్నాయం కనబడటం లేదన్నాడు. ఆర్టీఏ అధికారులు తమను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులను సీజ్ పేరుతో వేధించడంపై బోస్ పై విధంగా వ్యాఖ్యానించాడు. తాము బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
పాలెం ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ కఠిన వైఖరి కనబరచడంతో యజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తూ బస్సులను సీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రైవేటు ట్రావెల్స్ గుర్రుగా ఉన్నాయి. ఒక్క ఘటనను ఆధారంగా చేసుకుని ఆర్టీఏ అధికారులు తమను ఇబ్బందులు పెట్టడం తగదని వారు విన్నవిస్తున్నారు. ఒకవేళ ఇలానే ఉంటే ప్రైవేటు బస్సులను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలను పలు జిల్లాల్లో సుమారు 50కి పైగా బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 16 బస్సులను అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న 16 వోల్వో బస్సులను ఆర్టీఏ అధికారులు సోమవారం అనంతపురం వద్ద సీజ్ చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ అయిదు ప్రయివేటు బస్సులను అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.