ప్రాణాలైనా ఇస్తాం.. స్థలాలు ఇవ్వలేం
► తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం
► శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం
► ఇప్పుడు భూములు ఇవ్వమంటే ఎలా?
► జేసీని నిలదీసిన స్థానికులు
►మంచి పరిహారం ఇస్తామని భరోసా
‘ప్రాణత్యాగానికైనా సిద్ధం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్థలాలు ఇవ్వలేం’ అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న 173 కుటుంబాల ప్రజలు తెగేసి చెప్పారు. ‘తాతముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాం.. శివనామస్మరణ వింటూ ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నాం.. ఇప్పుడు మా ఇళ్లు ఖాళీ చేసి.. స్థలాలు లాక్కుంటే ఎలా బతికేది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదిరించి..బెదిరించి స్థలాలు లాక్కోవాలని చూస్తే ఇక్కడే చావనైనా చస్తామని శుక్రవారం సబ్‌కలెక్టర్ ఎదుట తమ ఆవేదన వెళ్లగక్కారు.
శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విస్తరణ పనులు చేపట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బృహత్తర ప్రణాళిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ గిరీషా హాజరయ్యారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య
పలువురు బాధితులు మాట్లాడుతూ తాతల.. ముత్తాతల కాలం నుంచే ఇదే ప్రాంతంలో నివాసముంటున్నామని, ఇప్పుడు స్థలాలు దేవస్థానానికి ఇవ్వాలని డిమాం డ్ చేయడం సరికాదని చెప్పారు. ‘ఇంట్లోనే ఉంటాం.. ఇల్లు కూల్చివేసి... స్థలాలు లాక్కోండి’ అంటూ కొందరు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎక్కడో స్థలాలు ఇస్తే ఎలా బతకా లి..? అంటూ మరికొందరు సమాధానం ఇచ్చారు. మా జీవితం ఇదే ప్రాంతంలో గడిపేయాలంటూ ఇంకొందరు జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు.
మంచి పరిహారం ఇస్తాం
జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ దేవస్థానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుం దని, తద్వారా మంచి జరుగుతుందని చెప్పారు. మంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భూములు అవసరమైతే తీసుకునే హక్కు ఉందని, మొత్తం 173 మందిలో కొందరు ఆలయ అభివృద్ధికి స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ముందుగా వారి స్థలాలు సేకరిస్తామని జాయింట్ కలెక్టర్ వివరించారు. కానీ దీనికి బాధితుల నుంచి సంతృప్తికర సమాధానం లభించలేదు.
వారికి ఇంతవరకు పరిహారం అందలేదు..
గాలిగోపురం 2010లో కుప్పకూలితే నష్టపోయినవారికి, కొత్త గాలిగోపురం నిర్మాణానికి స్థలాలు ఇచ్చినవారికి ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. దాంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు.
ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి
కొందరు తమ స్థలాలకు అంకణానికి రూ.15లక్షల చొప్పున ఇప్పించాలని, ఇంటికి ఓ షాపు, ఓ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కుదరదని, షాపులు అయితే కొందరికి ఇస్తామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. పరిహారం చెల్లింపులకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఓ పద్ధతి ప్రకారం స్థలం విలువకట్టి పరిహారం చెల్లిస్తుందన్నారు.
దీనిపై మరో రెండు, మూడు సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్ కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు, ఈవో భ్రమరాంబ, ఆలయ ఈఈ వెంకటనారాయణ, తహసీల్దార్ రమేష్‌బాబు, డీఎస్పీ వెంకటకిషోర్, సీఐ చిన్నగోవింద్, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.