సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల ఏడాదిలో స్మితా సబర్వాల్‌ను కలెక్టర్‌గా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త కలెక్టర్ పోస్టింగును రద్దు చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో స్మితా సబర్వాల్ నేతలు, ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరుపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
అభివృద్ధి కార్యక్రమాల పేరిట అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కార్యకలాపాలు ముమ్మరం చేసే ప్రణాళికలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకమునుపే ఇన్నాళ్లూ పెండింగులో వున్న పనులు, కార్యకర్తలను సంతృప్తిపరిచే పనులు పూర్తిచేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. అయితే కొత్తగా వచ్చే కలెక్టర్ నిబంధనల పేరిట ప్రతీ వ్యవహారాన్ని బూతద్దంలో పెట్టి చూస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే భావన ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. బదిలీ రద్దు చేయించడం ద్వారానే సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చనే అభిప్రాయం నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలు స్మితా సబర్వాల్ పోస్టింగును రద్దు చేయాలంటూ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్మితా సబర్వాల్ పోస్టింగ్ రద్దుపై జిల్లా మంత్రులను సంప్రదించినట్లు తెలిసింది. అయితే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ అంశంపై స్పందించేందుకు విముఖత చూపినట్లు సమాచారం.
డిప్యూటీని ఇరుకున పెట్టేందుకే?
డిప్యూటీ సీఎంతో సహా జిల్లాకు చెందిన మంత్రుల అభిప్రాయం తీసుకోకుండానే కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ నియామకం జరిగినట్లు ప్రచారం. సీఎం కిరణ్‌తో ఏడాదికాలంగా డిప్యూటీ సీఎం తీవ్రంగా విభేదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రకటన వెలువడిన తర్వాత ఇతర మంత్రులు కూడా సీఎంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సహా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న నేతలను ఇరుకున పెట్టేందుకే కొత్త కలెక్టర్ నియామకం జరిగినట్లు అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.
3
ఈ కలెక్టర్ మాకొద్దు
Published Sat, Oct 12 2013 12:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement