హైదరాబాద్: ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వెల్లడించారు. ప్రత్యేక హోదాతోపాటు రైతుల సమస్యలు, జీఎస్టీ ఇబ్బందులు, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటురీ పార్టీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని, తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని ఆనాడు బీజేపీ నాయకులు కూడా చెప్పారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. హోదా కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ కోసం పట్టుబడతామని తెలిపారు. ప్రత్యేక హోదా ఐదుకోట్ల మంది ఏపీ ప్రజల హక్కు అని, దీనిని సాధించుకోవడం అందరి బాధ్యత అని, ఇందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్నివిధాలుగా పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా సభలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. నీటి పంపకాలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అంశాన్ని కూడా పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. జీఎస్టీ నుంచి చేనేతరంగం, టెక్స్‌టైల్ రంగానికి మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారని, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని అన్నారు.
బిజీగా ఉండటం వల్లే బుట్టా రేణుక రాలేదు..
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తన నియోజకవర్గంలో ఇతర పనులతో బిజీగా ఉండటం వల్లే ఈ సమావేశానికి రాలేకపోయారని చెప్పారు. ఆమె మంత్రి లోకేశ్‌ను కలువడంలో తప్పేమీ లేదని ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు. నిజాయితీ ఉంటే ఎవరిని కలిసినా తప్పులేదన్నారు. తాము కూడా సీఎం చంద్రబాబును కలిశామని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు అన్యాయకరమైన పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు.