
కడుపు మండితే ఏమైనా మాట్లాడుతాం: ఏరాసు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా మంత్రులుగా తాము మాట్లాడామని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కడుపు మండితే ఏమైనా మాట్లాడుతామని అన్నారు. రాష్ట్ర విభజనలో సాంప్రదాయాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. విభజనకు అసెంబ్లీ తీర్మానం కోరాలన్నారు. శీతకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు రాదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని ఏరాసు ప్రతాప్ రెడ్డి అంతకుముందు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని అభిప్రాయపడ్డారు.