అశోక్ గజపతిరాజు
హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టం ద్వారా సదుపాయాల సాధన చాలా పెద్ద సమస్యగా మారిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నం తాము చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో చాలా ప్రక్రియ జరగవలసి ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలకంటే ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన ప్రాంతమైన విజయనగరంలో పెట్టమని కోరినట్లు తెలిపారు. అయితే కేంద్రం అందుకు తిరస్కరించినట్లు చెప్పారు. కొంతమంది చదువుకున్నవాళ్లు అక్కడ వద్దని చెప్పినట్లున్నారన్నారు. ఎయిర్పోర్టుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని చెప్పారు. కానీ తమ శాఖ అధికారులు సర్వే చేసిన తరువాత ఎన్ని సాధ్యమో తేలుతుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల వల్ల ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వివాదాలు పెద్దవి కాకుండా అందరూ సహకరించాలని అశోక్ గజపతి రాజు కోరారు.
**