
విభజన బిల్లును తిరస్కరించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వే దిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి డిమాండ్
అసెంబ్లీలో గాదె వెంకటరెడ్డిపై దాడికి ఖండన
హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచన
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యతను కాంక్షించే పార్టీల నాయకులు అసెంబ్లీలో, శాసనమండలిలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని ప్రతి క్లాజుపై చర్చించి ఓటింగ్ ద్వారా బిల్లును తిరస్కరిస్తున్నామంటూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి ఒక్కరే కృషి చేస్తున్నారని, ఆయన బాటలో మిగతా పార్టీల నేతలు నడవాలని సూచించారు. విభజనకు అనుకూలంగా అసెం బ్లీలో మాట్లాడే ప్రజాప్రతినిధుల్ని వచ్చే ఎన్నికల్లో సమైక్యవాదులు తిరస్కరించాలని కోరారు. అసెంబ్లీలో గాదె వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
విభజన బిల్లులోని ప్రతి క్లాజుపైనా చర్చించడానికి సమయం సరిపోదని, మరో 20 రోజుల అదనపు సమయాన్ని ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి సీఎం లేఖ రాయాలని కోరారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13న విభజన బిల్లు ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర విభజన యత్నాలను నిరసిస్తూ 17, 18 తేదీల్లో తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 20న అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. విభజనను వ్యతిరేకించే సమైక్యవాదపార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఆ పార్టీ ఎంపీలు ముందుకు రావాలని పిలుపుఇచ్చారు. సమైక్యస్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్న ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నారు. అసెం బ్లీల తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయరాదనే తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించేందుకు అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్జీవో సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ మాట్లాడుతూ.. టీ-బిల్లుపై అసెంబ్లీ, మండలిలలో అర్థవంతమైన చర్చ జరగట్లేదన్నారు. బిల్లును తిరస్కరిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేశారు. కొన్ని రాజకీయపక్షాలు బయట ఒక రకంగా, చ ట్టసభలో మరోవిధంగా ప్రవర్తిసున్నాయన్నారు.