
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేదు..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
సత్తెనపల్లి : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఎక్కడా మందుల కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సత్తెనపల్లిలో వంద పడకల వైద్యశాలకు రూ.4.20 కోట్లతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ కుక్కకాటు, పాముకాటుకు సైతం అన్ని మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఏ మందులు ఎక్కువగా అవసరమవుతున్నాయి..? పంపిణీ ఎలా ఉంది..? ఏ ఏ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ-ఔషధిని ప్రారంభించినట్లు తెలిపారు. తల్లీపిల్లల మరణాల నివారణకు 440 మంది పోస్టు గ్రాడ్యుయేట్లను తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 అంబులెన్స్‌లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు భవనాల నిర్మాణం, మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 140 వైద్యశాలలకు నాబార్డు నిధులు కేటాయించామన్నారు.
నరసరావుపేట వైద్యశాలకు అత్యధికంగా రూ.23కోట్లు మంజూరు చేసినట్లు చెప్పా రు. రాష్ట్రంలో నాలుగు వేల మంది నర్సుల కొరత ఉందని చెప్పారు. ప్రస్తుతం పీహెచ్‌సీలకు 540 మంది డాక్టర్లను తీసుకున్నట్లు వివరించారు. అనంతరం అదనపు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు , జిల్లా వైద్య శాఖ అధికారిణి డాక్టర్ పద్మజారాణి, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ జి.శ్రీదేవిలు మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరిండెంట్‌డాక్టర్ మంత్రు నాయక్, స్థానిక వైద్యులు తదితరులు పాల్గొన్నారు.