సిగ్గుపడుతున్నా! | Minister's comment on the doctors' negligence | Sakshi
Sakshi News home page

సిగ్గుపడుతున్నా!

Published Sat, Aug 15 2015 4:14 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

సిగ్గుపడుతున్నా! - Sakshi

సిగ్గుపడుతున్నా!

- వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి వ్యాఖ్య  
- డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌పై ఆగ్రహం
- రాష్ట్రంలోనే ‘అనంత’లో అధ్వానంగా వైద్య సేవలు
అనంతపురం మెడికల్ :
‘ఏందండీ ఇదీ.. జిల్లాలో వైద్య పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారు. పొద్దున్నే పేపర్లు చూస్తే ఓ మంత్రిగా సిగ్గుపడాల్సి వస్తోంది. రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయి’ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నగరంలోని మునిసిపల్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో జిల్లాలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మీడియా మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన కంగుతిన్నారు.
 
మీరు డాక్టర్ అని నాకనిపించడం లేదు
ఇటీవల ఉరవకొండలో పాముకాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడడంపై డీసీహెచ్‌ఎస్ సత్యనారాయణపై మంత్రి సీరియస్ అయ్యారు. ‘ఏ పాము కాటేసింద’ని మంత్రి ప్రశ్నించగా.. నాగుపాము మాదిరిగా ఉంది అంటూ సమాధానమిచ్చారు. దీంతో ‘ఏందయ్యా నువ్వు చెప్పేది. వాళ్లు చంపేసిన పామును కూడా తెచ్చారంట కదా? కళ్ల ముందు పాము ఉంటే నాగుపాము మాదిరిగా ఉందని చెప్పడమేంటి? దీన్ని బట్టి మీరసలు డాక్టరేనా అని అనుమానం వస్తుంది. ఆ రోజు పాము కాటుతో ఆస్పత్రికి వస్తే ఎందుకు ఇంజెక్షన్ చేయలేదు. పేషెంట్ రాగానే టెస్ట్ డోస్ చేసి ఇంజక్షన్ చేయాలని తెలీదా? ప్రాణాలతో ఆడుకుంటారా? డ్యూటీ డాక్టర్(తులసి)పై ఏం చర్యలు తీసుకున్నారు.. అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమై వైద్యవిధాన పరిషత్ అధికారి సోమరాజుకు మంత్రి ఫోన్ చేసి ‘ఉరవకొండలో పాముకాటుతో వస్తే చికిత్స చేయకుండా..వెళ్లిపొమ్మన్నారట! తక్షణం ఆమెపై చర్యలు తీసుకోండి అని ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్‌లో ఏం జరుగుతోందో నివేదిక కావాలి. విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి కలుగజేసుకుని ధర్మవరంలో ఏరియా ఆస్పత్రి ఉందని, అయితే ప్రతి కేసును అనంతపురానికి రెఫర్ చేస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.  
 
డీఎంహెచ్‌ఓపై ఆగ్రహం : జననీ శిశు సురక్ష (జేఎస్‌కే) కింద  విడుదలవుతున్న నిధులను వైద్యులు, సిబ్బంది కాజేస్తున్న ఘటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌ఓ ప్రభుదాస్‌ను పిలిపించి ‘ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు. అసలు మీకు బాధ్యత లేదా? బాలింతల కోసం మంజూరు చేస్తున్న డబ్బులను తినేస్తున్నా ఎందుకింత నిర్లక్ష్యమని మండిపడ్డారు. నిధులు కాజేసిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కేవలం హైదరాబాద్‌కు లేఖ రాశామని చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అసలేం జరుగుతోందో చెప్పండని ప్రశ్నించారు. గార్లదిన్నె పీహెచ్‌సీలో రూ.3 లక్షలను ఒక సీనియర్ అసిస్టెంట్ ఫోర్జరీ సంతకాలతో డ్రా చేసినట్లు డీఎంహెచ్‌ఓ చెప్పడంతో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. డీఎంహెచ్‌ఓ బిక్కమొహం వేయడంతో అక్కడే ఉన్న కలెక్టర్‌తో తక్షణం ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.  
 
ప్రత్యేక దృష్టి పెట్టండి
వైద్య ఆరోగ్యశాఖకు, 108 సర్వీసెస్‌కు మధ్య కో ఆర్డినేషన్ లేదు. ఫలితంగా చాలా మంది క్షతగాత్రులను ఆరోగ్యశ్రీ రెఫరల్ ఆస్పత్రులకు తీసుకెళ్లకుండా కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని తెలుసుకున్న మంత్రి.. ‘ఏందయ్యా ఇది.. అందరి ముందు మేం దోషులుగా ఉండాలా? అంటూ డీఎంహెచ్‌ఓను ప్రశ్నించారు. ఆస్పత్రులు గానీ, వాటి విధానాలు గానీ ఏమీ బాగాలేవని, ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కోన శశిధర్‌ను ఆదేశించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, ఈరన్న, పార్థసారధి, ఎమ్మెల్సీలు శమంతకమణి, తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం మేయర్ స్వరూప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement