హైదరాబాద్, సాక్షి: సీమాంధ్రులు హైదరాబాద్‌లో సెప్టెంబరు 7వ తేదీన నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతిస్తే రణరంగమే అవుతుందని ఓయూ విద్యార్థి ఐకాస స్పష్టం చేసింది. ఎల్బీస్టేడియంలో సభ నిర్వహణకు వారికి అనుమతి ఇస్తే.. తమకు నిజాం కళాశాలలో సభకు అనుమతి ఇవ్వాలని, లేదంటే బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం సాక్షిగా.. ఇరువర్గాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ది ప్రెస్‌లో జేఏసీ నాయకులు పిడమర్తి రవి, దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్ మాట్లాడారు. రాష్ర్ట విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించినప్పటికీ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదం పొందే వరకు కాంగ్రెస్‌ను నమ్మేదిలేదన్నారు. అంతవరకు తమ పోరాటం ఆగదన్నారు. నవంబర్‌లోపు బిల్లును ఆమోదింపజేయకపోతే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇందుకు ఓయూ జేఏసీ నూతన పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు.
నల్లగొండ జిల్లాకు చెందని ఓ మంత్రి తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకుంటున్నాడని, రాజకీయ నాయకులు ఉద్యమంలో విద్యార్థుల పాత్రను తక్కువ చేసి చూపడం సరికాదన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ పునఃనిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. తాము ఏ రాజకీయ పార్టీ చెప్పుచేతల్లో ఉద్యమం చేయలేదన్నారు. కానీ ప్రస్తుతం సీమాంధ్ర విద్యార్థులు రాజకీయ నాయకులు, పార్టీల ఉచ్చులో పడి విద్యా సంవత్సరాన్ని నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల జీవితచరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఉద్యమంలో జైలుకెళ్లిన విద్యార్థులకు ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయోపరిమితి సడలింపునివ్వాలని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతివిద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యతనివ్వాలని వారు కోరారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంత్‌చారి, యాదిరెడ్డి తదితరుల జీవితగాథల్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
అనుమతిస్తే రణరంగమే
Published Mon, Aug 26 2013 7:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement