రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం
► చంద్రబాబు, వెంకయ్యల స్వప్రయోజనాల కోసం ఏపీకి అన్యాయం
► వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధ్వజం
► ఆత్మగౌరవ యాత్ర జయప్రదం చేయాలని గాజువాకలో ప్రచారం
గాజువాక : విశాఖ కేంద్రంగా విశాఖ, గుంతకల్, గుంటూరులతో కూడిన రైల్వేజోన్‌ను సాధించేవరకూ తమ పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యు డు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఈనెల 30 నుంచి చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ గాజువాకలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్రను విజయసాయిరెడ్డి ప్రారంభించారు.
బీసీ రోడ్‌లోని వైఎస్ విగ్రహం వద్ద ప్రారంభమైన పాదయాత్ర గాజువాక మెయిన్‌రోడ్‌మీదుగా పాతగాజువాక జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు విద్యా సంస్థలు, రైల్వే జోన్‌తోపాటు పలు రాయితీలను ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అద్దె భవనాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నామంటూ కంటితుడుపు చర్యలతో సరిపెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.
ఎలాంటి హక్కులు సాధించలేదని, రాష్ట్రానికి సహజంగా రావాల్సిన నిధులను కూడా తాము సాధించేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడంలేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం జగన్ మోహన్‌రెడ్డి వివిధ పోరాటాలు సాగిస్తున్నారన్నారు. రైల్వే జోన్ కోసం పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. రెండోదశ పోరాటంలో భాగంగా ఈనెల 30 నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించామన్నారు.
జోన్‌ను సాధించడం కోసం ప్రజలను సిద్ధం చేయడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నామన్నారు. అనకాపల్లి నుంచి భీమిలి వరకు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు గరికిన గౌరి, ఉరుకూటి అప్పారావు, బొడ్డు నర్సింహపాత్రుడు (కేబుల్ మూర్తి), మార్టుపూడి పరదేశి, రాజాన వెంకటరావు, నక్క వెంకట రమణ, రాజాన రామారావు, ఎస్.శ్రీనివాస్‌గౌడ్, రాజ్‌కుమార్ ఆచార్య, తిప్పల వంశీరెడ్డి, ఎన్నేటి రమణ, రావాడ శివ, ధర్మాల శ్రీను, చిత్రాడ వెంకట రమణ, పల్లా చినతల్లి, రెడ్డి జగన్నాథం, ఈగలపాటి యువశ్రీ, మారిశెట్టి మల్లెపూలు, పల్లా పెంటరావు, గంగాభాయి, పూర్ణానందశర్మ, షౌకత్ ఆలీ, బోగాది సన్ని, తిప్పల దేవన్‌రెడ్డి, కటికల కల్పన, బొడ్డ గోవింద్, రోజారాణి, ప్రగడ వేణుబాబు, ఎన్.ఎస్.ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.