
విభజన ఒక పీడకల.. అయినా మనం బుల్లెట్టే
మంగళగిరి: విభజన వల్ల వచ్చిన ఇబ్బంది, ఆ సమయంలో జరిగిన అన్యాయం, కాంగ్రెస్ తీరు, అవమానించిన విధానం ఎప్పుడూ మర్చిపోలేమని ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం మంగళగిరిలో జరిగిన మహాసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ విభజన ఒక పీడకల అని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పారు. సోనియాగాంధీ తెలుగు ప్రజల పొట్టను కొట్టిందని ఆరోపించారు. ఇటలీ స్వాతంత్ర్యం రోజే తెలుగు రాష్ట్రాన్ని విభజించారని చెప్పారు. అయినా బుల్లెట్ లా దూసుకెళతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్యే లేదని అన్నారు.
ఈ సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృశిచేద్దామని సంకల్పించాలని కోరారు. జూన్ 2 వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన రోజుగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటానని, వాటికి మీ ఆశీస్సులు కావాలని సభకొచ్చిన ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడని ఆయన వద్ద శిక్షణ పొందిన తాను తెలుగు అమరావతి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజానీకం చాలా తెలివైన వారని వివరించారు. అన్ని చోట్ల రాణిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో కరువు పోవాలంటే గోదావరి నీళ్లు కావాలని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు విజన్ ఉందని గుర్తించే ఓటు వేశారని, ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని అన్నారు. ప్రపంచం మనవద్దకు వచ్చేలా తయారు చేస్తా అని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చినవారిని మర్చిపోలేమని అన్నారు.