
విశ్వనగరంగా అమరావతి
మహాసంకల్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ
♦ ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలను ఇక్కడ కల్పిస్తా
♦ 2050 నాటికి ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా ఏపీ
♦ రాష్ట్రాభివృద్ధి కట్టుబడి ఉన్నానని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన బాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలను ఇక్కడ కల్పిస్తానని, హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు నగరాలకంటె అత్యుత్తమంగా ఈ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంవత్సరం క్రితం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఖాళీ స్థలంలోనే సోమవారం సాయంత్రం ఆయన మహాసంకల్పం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి నుంచి 13 జిల్లాలకు రోడ్డు, రైలు, విమాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంవత్సరం నుంచి రాష్ట్రాభివృద్ధికి ప్రణాళిక తయారుచేసుకున్నానని చెప్పారు.
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తాను తీసుకుంటానని, తనను ఆశీర్వదించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ స్పూర్తితో సంకల్పం చేసి బుల్లెట్‌లా దూసుకుపోతానని వెనక్కుతిరిగి చూడనని చెప్పారు. 2022 నాటికి దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో మొదటి రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. చివర్లో సభకు హాజరైన వారితో మహాసంకల్పాన్ని చేయించారు. ప్రతి సంవత్సరం ఎక్కడున్నా ఇదేరోజున ఈ సంకల్పాన్ని గుర్తుచేసుకోవాలని కోరారు. ఈ సంకల్పాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాలన్నారు.
అగ్రగామిగా ఏపీ: గవర్నర్
ఘన చరిత్ర కలిగిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేశారని, ఇదే స్ఫూర్తితో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేయడానికి ప్రజలు భాగస్వాములు కావాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. మహా సంకల్పం సభలో ‘స్వర్ణాంద్ర కోసం మహాసంకల్పం’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, కేంద్రమంత్రి ఆశోక్ గజపతి రాజు, రాష్ట్రమంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల, కామినేని శ్రీనివాస్, హిందూ పురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ఎన్జీవో సంఘ నేత అశోక్ బాబు తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు , 13 జిల్లాలకు చెందిన వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం క్యాంప్‌ఆఫీస్ ప్రారంభం
సాక్షి, విజయవాడ: నగరంలోని జలవనరుల శాఖ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తన క్యాంపు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం 8.41 గంటలకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, పూర్తి పచ్చదనంతో రాజధాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు. పూజా కార్యక్రమాలను కె.కె.రావు సిద్ధాంతి, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు దుర్గాప్రసాద్ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటల వరకు చంద్రబాబు క్యాంపు కార్యాలయంలోనే గడిపి, ఆ తరువాత గుంటూరు జిల్లాలో జరిగే మహాసంకల్ప సభకు బయలుదేరారు. చంద్రబాబు కుమారుడు లోకేష్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.