మేం భూములు ఇచ్చేది లేదు: రైతులు
గుంటూరు: తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు మరోసారి స్పష్టం చేశారు. రైతు పక్షపాతిని అని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇవాళ ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
నిస్వార్ధంగా ఉన్న వారి ఆస్తులను తగులబెట్టారని రైతులు ఏకరువు పెట్టారు. రైతులను, ఆస్తులను తగులబెట్టి.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబు రాజధాని కట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు. రైతు పక్షపాతిని అని చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఇవాళ చోద్యం చూస్తోందన్నారు. భూములను ఇవ్వనన్న రైతులకు నష్టం చేయడం చాలా దారుణమని రైతులు కరాఖండిగా చెప్పారు.