విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు పంపిణీ చేశామన్నారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి బాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ పరేడ్‌ను తిల కించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.600 కోట్ల పంట రుణాలు పంపిణీ లక్ష్యం కాగా ఇంత వరకు 74 వేల మందికి రూ.370 కోట్లుమంజూరు చేశామన్నారు.
గతేడాది నీలం తుపానులో నష్టపోయిన 234 మంది రైతులకు రూ.11.50 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమచేసినట్లు చెప్పారు. సాగురైతు రక్షణహస్తం పథకం కింద 3,081 మందికి కార్డులు జారీ చేశామని, ఇందులో 115 మంది కౌలు రైతులకు రూ.18.12 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. 795 హెక్టార్లలో రూ.1.28 కోట్ల ఖర్చుతో ఆయిల్‌పామ్ తోటల విస్తరణ చేపట్టినట్టు చెప్పారు. 4,846 హెక్టార్లలో వివిధ ఉద్యానవనాల పెంపకానికి రూ.4.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించేంకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
జోరుగా జలాశయాల పనులు : జిల్లాలో జలాశయాలను రూ.55 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్టు చెప్పారు. రైవాడ,కోనాం పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. తాచేరు, రంగబోలుగెడ్డ, ఉరకగెడ్డ, పాలగెడ్డ, జగ్గమ్మగెడ్డ, ఇసుకగెడ్డలపై రూ.26.10 కోట్లతో జలశయాల నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా 7,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. అలాగే 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.43.78 కోట్లతో తాండవ, వరాహ, శారదా నదులపై ఆనకట్టల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
గిరిజనుల సంక్షేమానికి పథకాలు : ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు, మలేరియా ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మలేరియా నివారణకు 3574 గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారీ పూర్తయిందన్నారు. ఏజెన్సీలో రహదారులు, వంతెనలు అభివృద్ధికి రూ.88.17 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరు మండలాల్లో రూ.60 కోట్లతో 820 ప్రాధాన్యతాపరమైన పనులు చేపట్టినట్టు వెల్లడించారు. 2,374 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.21.25 లక్షల రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఏజెన్సీలో కాఫీబోర్డు, ఉపాధి హామీ పథకం, ఐటీడీఏ సంయుక్తంగా రూ.349 కోట్లతో 4 వేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు : జిల్లాలో ప్రస్తుతం 74 భారీ పరిశ్రమలు ఉన్నాయని, రూ.74695 కోట్ల పెట్టుబడితో మరో 105 నెలకొల్పుతున్నామని మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 38 వేల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. అదే విధంగా రూ.3,869 కోట్లతో 7,159 మధ్య, చిన్నతరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందన్నారు.
మహిళా సంక్షేమానికి పథకాలు : మహిళా సాధికారతలో భాగంగా 2966 గ్రూపులకు రూ.79.2 కోట్లు రుణ సదుపాయం కల్పించినట్లు మంత్రి తెలిపారు. 29,836 స్వయం సేవా సంఘాలకు రూ.11 కోట్లు వడ్డీలేని రుణాలను వారి సేవింగ్స్ ఖాతాలకు నేరుగా జమ చేసినట్టు చెప్పారు. స్త్రీనిధి పథకం కింద 4500 మంది గ్రూపు సభ్యులకు సుమారు రూ.8 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. బాలికా శిశు సంరక్షణ పథకం కింద రూ.12.52 కోట్లు విలువైన బాండ్లను 3,878 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జారీ చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు జి.అచ్చయ్యమ్మ, ఎల్.సీతాదేవి, టి.అప్పారావులకు మంత్రి బాలరాజు, కలెక్టర్ వి.శేషాద్రి ఘనంగా సన్మానించారు. కాగా పంద్రాగస్టు వేడుకల్లో ఏటా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన ఆనవాయితీ. ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా ఈ ఏడాది శకటాల స్థానంలో ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంత్రి బాలరాజు సందర్శించారు. వివిధ పథకాల ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో జేసీ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ దుగ్గల్, డీఆర్వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
Published Fri, Aug 16 2013 3:05 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement