వేసవి తీవ్రత పెరుగుతుండగా మరోపక్క రాజకీయంగా శాసనమండలి ఎన్నికలు జిల్లాలో ఈ వారం కాక పుట్టించాయి. ఒకపక్క ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, మరోపక్క ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జిల్లాలో చర్చనీయాంశాలుగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులే ఓటర్లు. అయినా రాజకీయ ప్రమేయం లేకుండా ఈ ఎన్నికలు జరగకపోవడం విశేషం. ఇదివరకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఈ ఎన్నికలకు ఏర్పడింది. తొలిసారి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ చైతన్యరాజును ప్రకటించింది.
టీడీపీలో కీలక నేత, లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి హయాం నుంచి చైతన్యరాజుకు టీడీపీతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అదే ఈ ఎన్నికల్లో తనకు సానుకూలమవుతుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో సమస్యలు పరిష్కరించగలరనే నమ్మకాన్ని ఉపాధ్యాయుల్లో కలిగించగలిగామనే అంచనాల్లో ఉన్నారు. ఒకపక్క చైతన్యరాజు మరోవైపనాయనకు మద్ధతుగా తనయులు ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, శశివర్మ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలను జిల్లాలో మకాం పెట్టించి మరీ ప్రచారాన్ని హోరెత్తించారు.
మరోపక్క ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు మొదట్లో టీడీపీ మద్ధతు లభిస్తుందని నిరీక్షించారు. ఆ ఆశ నెరవేరదని తేలిపోయాక స్వతంత్ర పోరుకు సై అన్నారు. టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ఆయన.. విద్యాపరంగా తనకున్న పరిచయాలు, ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలు సానుకూలమవుతాయని అంచనా వేస్తున్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఉపాధ్యాయులు వెంట రాగా ఆయన రెండు జిల్లాల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో తాను చేయదలుచుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.అలాగే ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు హడావిడి, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ప్రచారాన్ని ముగించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయనకు అక్కడ విద్యాదాతగా ఉన్న మంచి పేరు ఆ జిల్లాలో కలిసివస్తుందని లెక్కలేసుకున్నారు. మన జిల్లాకు వచ్చేసరికి ఉపాధ్యాయ సంఘ బలంపైనే నమ్మకం పెట్టుకుని బరిలో గెలుపోటములను తేల్చుకోవాలని అనుకుంటున్నారు.
తాయిలాలపై వివాదం
ఒక అభ్యర్థి సుమారు రూ.15వేల విలువైన ఆరు వెండి గ్లాసుల గిఫ్ట్ ప్యాక్‌లను ఉపాధ్యాయులకు తన అనుచరుల ద్వారా అయితే ఆ గ్లాసులు నాణ్యత లేనివంటూ పోటీలో ప్రత్యర్థి ప్రచారం చేశారు. అయితే ఆ గ్లాసుల నాణ్యతపై నిగ్గు తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ అభ్యర్థి అనుచరుల ద్వారా సవాల్ కూడా విసరడం గమనార్హం. దీనినిబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలిపోతుందా లేక రెండో ప్రాధాన్య ఓటు తప్పదా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఎమ్మెల్యేల కోటాలో జిల్లాకు ప్రాధాన్యం
ఇదిలా ఉండగా, మరోపక్క ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు లాంఛనంగానే జరిగినా ఆసక్తిని రేకెత్తించాయి. విభజన అనంతరం ఏర్పడ్డ రాష్ట్రంలో వచ్చిన ఐదు ఎమ్మెల్సీల్లో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు దక్కాయి. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, మరొకటి టీడీపీకి దక్కాయి. మొత్తం ఐదు స్థానాల్లో పాలక పక్షం, ప్రతిపక్షం జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వడం కాకతాళీయంగా జరిగినా.. జిల్లా ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి. ఎటువంటి మాట ఇవ్వకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్ అయిన మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఎమ్మెల్సీని చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన విశ్వసనీయత, విధేయతకు గుర్తింపుగా ఈ పదవి వరించింది. టీడీపీ నుంచి వీవీవీ చౌదరి(కూర్మాపురం అబ్బు)కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యానికి నిరాశను మిగిల్చారు. తద్వారా గతంలో ఆయనకు ఇచ్చిన మాట తప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ఓట్లు వేయించుకుని బీసీలకు మొండిచేయి చూపిన బాబుపై ఆ పార్టీలో బీసీలు భగ్గుమంటున్నారు.
అంగన్‌వాడీలపై ఉక్కుపాదం
వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. జిల్లాలో ఎక్కడికక్కడ చివరకు ఇళ్ల నుంచి కూడా బయటకు రాకుండా హౌస్ అరెస్టులు చేయించింది. అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపిన సీపీఎం, సీఐటీయూ నేతలను కూడా అన్యాయంగా అరెస్టులు చేసి నిర్బంధించిన చంద్రబాబు సర్కార్ పాత వాసనలు వీడలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
అటు ఎండ భగభగ ఇటు ఎన్నిక సెగ
Published Sun, Mar 22 2015 1:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement