
మంత్రిగా నేను చేసిన తప్పేంటి?
గుంటూరు : ‘మంత్రిగా నేను చేసిన తప్పేంటో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. సముద్రతీర ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు చేపడితే పరిశ్రమలు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అప్పటి ముఖ్యమం త్రి డాక్టర్ వైఎస్‌ను కోరా. ఈ క్రమంలోనే వాన్‌పిక్ ప్రాజెక్టు అంశం తెరమీదకు వచ్చింది. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించాకే అందుకు సంబంధించిన జీవో విడుదలైంది. అది నా ఒక్కడి నిర్ణయం కానేకాదు. అయినా సీబీఐ నన్ను మాత్రమే అరెస్టు చేసింది. అన్యాయంగా 18 నెలలు జైల్లో పెట్టింది. ఒక్కటి మాత్రం నిజం. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు పెరిగిన ప్రజాదరణను చూసి ఓర్వలేక, దానికి కట్టడి వేసేందుకే ఢిల్లీ పెద్దల సహకారంతో సీబీఐని అస్త్రంగా నన్ను, నా తరువాత వైఎస్ జగన్‌ను అరెస్టు చేశారు. అధికార పార్టీ ఇంత దిగజారుడు రాజకీయానికి, కుట్రకు పాల్పడుతుందని ఊహించలేకపోయా..’ అని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.
శుక్రవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మోపిదేవి శనివారం గుంటూరు జిల్లా రేపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సిండికేట్ల వారెవరూ తనకు రూ.10 లక్షలు ఇవ్వలేదని, ఈ విషయంపై అసెంబ్లీలో రాద్దాంతం జరిగిన రోజే సీఎంకు వివరణ ఇచ్చానని చెప్పారు. ఆ రోజే తన అరెస్టుకు బీజం వేశారని ఆలస్యంగా గుర్తించానన్నారు.