
కమలమ్మా.. ఇదేందమ్మా..
సాక్షి, గుంటూరు:
మంగళగిరి పట్టణానికి చెందిన కాండ్రు కమల.. ప్రజాప్రతినిధిగా సుమారు పదేళ్ల అనుభవం మూటగట్టుకున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా ఐదేళ్లు.. ఎమ్మెల్యేగా ఐదేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నా, మంగళగిరి వాసులకు ఒరగబెట్టిందేమీ లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్య ప్రాధాన్యతను సంతరించుకున్న మంగళగిరి పట్టణాభివృద్ధికి వివిధ అవకాశాలు ఉన్నా.. ప్రజాప్రతినిధిగా ఏమాత్రం వినియోగించుకోలేకపోయారనే విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. సొంత పనులకు ప్రాధాన్యమిచ్చారే తప్ప ప్రజాసమస్యలను పట్టించుకోలేదన్న అపవాదును మూటకట్టుకున్నారు. కనీసం తన సామాజికవర్గం చేనేతల బతుకుదెరువుపై కూడా భరోసా కల్పించలేకపోయారనే విమర్శలు లేకపోలేదు.
మంగళగిరి మున్సిపల్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా కమల గుర్తింపుపొందినా.. తన హయాం(2000-05)లో చెప్పుకోతగ్గ ప్రగతి సాధించలేకపోయారని చెప్పవచ్చు. చైర్‌పర్సన్‌గా పదవీ కాలం ముగిశాక.. ఇంటికే పరిమితమైనా.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి మురుగుడు హనుమంతరావును కాదని.. అనూహ్యంగా కమలకు అసెంబ్లీ టెకెట్ కేటాయించి, ఆమె గెలుపునకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేశారు. తదనంతర పరిణామాల్లో ప్రజాప్రతినిధిగా కమల తీరు నానాటికి తీసికట్టు అన్న చందంగా మారింది.
మంగళగిరి అంటే చేనేత..
చేనేత అంటే మంగళగిరి..
మంగళగిరి పేరు చెబితే నేతన్న గుర్తుకు వస్తాడు. అలాంటి మంగళగిరిలో నేడు చేనేత కార్మికులు దుర్భర జీవనమే గడుపుతున్నారు. మంగళగిరిలో 30 ఏళ్ల కిందట 12 వేల చేనేత మగ్గాలు ఉంటే.. ప్రస్తుతం రెండు వేల మగ్గాలు కనాకష్టంగా నడుస్తున్నాయి. నేతన్న పనిలో అనుభవంలోకొచ్చాక మొదటిసారి మేలుపొందింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభుత్వంలోనేనని ఇక్కడ చేనేత కార్మికులు సగర్వంగా చెబుతున్నారు.
50 ఏళ్లు నిండిన నేత కార్మికులకు నెలకు రూ.200 పింఛన్ ఇచ్చి మూడు పూటలా అన్నం పెట్టి మహానుభావుడయ్యాడని చెమర్చిన కళ్లతో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. క్రెడిట్ లోన్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం.. చేనేత రుణాల మాఫీని వై.ఎస్.ప్రకటించి, అమలుచేసినా.. ఆయన చనిపోయిన తర్వాత పాలకులు పట్టించుకోకపోగా, స్థానిక నాయకులు మొహంచాటేశారు.
మంగళగిరిలోనే 500మంది పద్మశాలి కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప ఇళ్లు కట్టించారు. అప్పట్లో నేతమగ్గాలకు స్థలం అడిగితే.. షెడ్లు కట్టిస్తామని స్థలం కేటాయించారు. అయితే ఎమ్మెల్యే కమల ఈ షెడ్ల నిర్మాణాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. మున్సిపల్ చైర్‌పర్మన్‌గా ఉన్నప్పుడు ఆటోనగర్ వెనుక వైపు చేనేత పార్కు నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం శిలాఫలకం ఏర్పాటు చేయగా.. దీని సాధన
లోనూ కమల కృషి శూన్యం.
హామీలపైనా దృష్టి సారించని వైనం
గుంటూరు, కృష్ణా జిల్లాలకు అనువుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుంటూరు పర్యటనలో ప్రకటించారు. ఈ హామీపై ఎమ్మెల్యే కమల కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం పరిశీలనాంశం. పట్టణంలో ప్రధాన సమస్యగా పరిణమించిన డ్రైనేజీ సమస్యను అసలు పట్టించుకోలేదు.
పట్టణంలో మురుగు సమస్యను పరిష్కరించేందుకు రూ.30 కోట్ల జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో ప్రారంభించిన మురుగు కాలువల నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆక్రమణదారులకు ఎమ్మెల్యే కమల కొమ్ముకాశారనే ఆరోపణలు లేకపోలేదు. కేంద్రప్రభుత్వ నిధులు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు.
బలహీనవర్గాల ప్రజలకు ఆర్టీసీ డిపో రోడ్డులో నిర్మించిన రాజీవ్ గృహకల్ప పథకంలో కేవలం 504 మందికే నివాసాలు కేటాయించారు. మిగిలిన 510 మందికి రెండో దశలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా నేటివరకు ఆచరణకు నోచుకోలేదు. ఇక రాజీవ్ స్వగృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న ఆరు వేల మందికి ఇప్పటి వరకు నగదు చెల్లించలేదు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. గృహ నిర్మాణానికి స్థల సమస్య పేరుతో కాలయాపన జరుగుతూనే వుంది. నీరో తరహా పాలనతో పట్టణవాసులు విసిగిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.