సాక్షి, కర్నూలు: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు నాయకులు వరుసకట్టారు. ఐదేళ్లు గడిచే సరికి.. ఆ పార్టీ టిక్కెట్ ఇస్తామన్నా వద్దుబాబోయ్ అనే పరిస్థితి. కనీసం మున్సిపల్ ఎన్నికల్లోనూ బరిలో నిలిచేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చకపోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది. వైఎస్‌ఆర్ మరణానంతరం నేతల్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకోగా.. ఇటీవల రాష్ట్రాన్ని రెండుగా చీల్చడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు తెరలేచింది. నామినేషన్ల దాఖలు పూర్తి కాగా.. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. సాధారణ ఎన్నికలకు మరో నెల రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే నామినేషన్ల దాఖలు సమయంలోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తేలిపోయింది.
ఆళ్లగడ్డలో 20 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అదేవిధంగా నంద్యాలలో 42 వార్డులకు 6, బనగానపల్లె 20 వార్డులకు 10,ఆత్మకూరులో 20 వార్డులకు 7, నందికొట్కూరులో 20 వార్డులకు 3, గూడూరులో 20 వార్డులకు 18, ఆదోనిలో 41 వార్డులకు 40, ఎమ్మిగనూరులో 33 వార్డులకు 44, డోన్‌లో 20 వార్డులకు 27 మంది చొప్పున నామినేషన్లు వేశారు. పోటీ చేస్తామని ముందుకొచ్చిన వారికి అవకాశం కల్పించడమే తప్ప.. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం లేదనేది నామినేషన్లను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది.
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీగా ఒక్క వెలుగు వెలిగినా.. ఇప్పుడు జెండా మోసే వారు కరువయ్యారు. కనీస హడావుడి కూడా కరువైందంటే విభజనను ప్రజలు ఎంతలా వ్యతిరేకిస్తున్నారో అద్దం పడుతోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌కు కోట్ల కుటుంబమే పెద్ద దిక్కు. వీరు పార్టీని వీడకపోయినా.. సొంత నియోజకవర్గం డోన్ నుంచి పోటీ చేసేందుకూ జంకుతుండటం గమనార్హం. ప్రస్తుత రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ మొదటి నుంచి డోన్ అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించినా.. ప్రజాగ్రహానికి భయపడి ఆలూరు నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఈమె వెంట నడిచిన ఆర్‌ఈ రవికుమార్, రేగటి రామ్మోహన్, చిన్నకేశవయ్యగౌడ్ తదితర ప్రముఖ నాయకులంతా ప్రజాదరణ కలిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక్కడి నుంచి మున్సిపల్ వార్డు స్థానాలకు కొందరు నామినేషన్లు వేసినా.. విధిలేని పరిస్థితుల్లో చాలా మంది నేడు ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నంద్యాలలోనే ఇదే పరిస్థితి నెలకొం ది. ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి రంగు మార్చడంతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది.
ఆదోనిలో నామినేషన్లు దాఖలు చేసినా.. మాజీ ఎమ్మెల్సీ, కోట్ల బంధువు చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడం అభ్యర్థులను నిరాశపరుస్తోంది. కష్టమైనా నష్టమైనా తప్పదనుకొని అభ్యర్థులే ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ పార్టీ మారే ఆలోచనలో ఉండటంతో అభ్యర్థులకు అండగా నిలిచే నాయకుడు కరువయ్యారు.
బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల్లోనూ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థుల వెంట పట్టుమని పది మంది కూడా వెంటనడకపోవడంతో గెలుపుపై వీరిలో నమ్మకం సన్నగిల్లుతోంది. ఇకపోతే విభజనకు మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నేతలపైనే ఆశలు పెట్టుకుంది. నేతలైతే వస్తున్నారు కానీ.. క్యాడర్ రాకపోవడం ఈ పార్టీ శ్రేణులనూ ఆందోళనకు గురిచేస్తోంది.
‘హస్తవ్యస్తం'
Published Mon, Mar 17 2014 11:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement