సాక్షి, గుంటూరు,మంగళగిరి నియోజకవర్గంలోని మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ ఆందోళన చెందుతోంది. ఇక్కడున్న రెండు మున్సిపాలిటీల్లో ‘దేశం’ ఎదురీతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వార్డుల్లో డబ్బు వెదజల్లినా ఫలితంపై నమ్మకం లేక దేశం శ్రేణులన్నీ డీలా పడ్డాయి. మొదటి నుంచీ మంగళగిరి మున్సిపాలిటీలో టీడీపీకి పట్టుంది. అయితే రాను రాను టీడీపీ ప్రాభవం తగ్గిపోతుండటంతో శ్రేణులన్నీ నిర్వేదంలో ఉన్నాయి.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనా మంగళగిరిలో మాత్రం ఎమ్మెల్యే కాండ్రు కమల తన పట్టు నిరూపించుకునేందుకు మొదట్లో కొద్దిగా హడావుడి చేశారు. అల్లుడు సత్యంను బరిలో దించాలని యోచించారు. అయితే ఆయన విముఖత చూపడంతో ఎమ్మెల్యే తన సొంత తమ్ముడు కొల్లి వాసును రంగంలోకి దించారు. ప్రజాగ్రహం కారణంగా క్రమంగా కాంగ్రెస్ పరిస్థితి రెండు మూడు వార్డులకు పరిమితమైంది. ఇటు టీడీపీ రెండు రోజుల నుంచి పంపకాల్లో బిజీ బిజీగా ఉంది. ఓటుకు గరిష్టంగా రూ.3 వేలు పంచినా గెలుపుపై నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తున్నారు.
తాడేపల్లి మున్సిపాలిటీలోనూ ఉనికి కాపాడుకునేందుకు దేశం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు సాధించలేకపోయినా ఫర్వాలేదు కానీ వైఎస్సార్ సీపీ హవా తగ్గించే యోచనలో ఉన్నారు. మద్యం ఏరులై పారించైనా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో డబుల్ గేమ్.. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తమ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం డబుల్ గేమ్ ఆడుతోంది. ఇప్పటివరకు చైర్మన్ అభ్యర్థి ఫలానా అని చెప్పే సాహసం చేయలేక పోతోంది. మంగళగిరి మున్సిపాలిటీ ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది.
మొత్తం ఇక్కడ 32 వార్డులున్నాయి. మున్సిపాలిటీ ఓసీ జనరల్ అయినా వైఎస్సార్ సీపీ మొట్ట మొదటగా బీసీ అభ్యర్థిని ప్రకటించింది. చిల్లపల్లి మోహనరావును తమ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే ప్రకటించారు. టీడీపీ నేతలు మాత్రం పూటకో మాట మారుస్తూ చైర్మన్ అభ్యర్థిగా రోజుకో పేరు తెరపైకి తెస్తున్నారు. చైర్మన్ అభ్యర్థిగా గంజి చిరంజీవిని గతంలో గుంటూరు పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి గల్లా జయదేవ్ ప్రకటించారు. కానీ చైర్మన్ అభ్యర్థి తామేనంటూ రోజుకొకరు ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు సామాజిక వర్గం అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ వ్యాపారికి చైర్మన్ అభ్యర్థిత్వం ప్రకటిస్తే గంజి చిరంజీవితో ‘సర్దుబాట్లు’ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చైర్మన్ అభ్యర్థిత్వం కోసం మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌తో సిఫారసు చేయించి కొందరు నేతలు రాయ‘బేరాలు’ సాగిస్తున్నారు.ఈ విషయంలో స్పష్టత లేకపోవడం తమ పార్టీకి నష్టమేనని టీడీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.
మొట్ట మొదటిసారి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తాడేపల్లిలోనూ చైర్మన్ అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. మొత్తం మీద మంగళగిరి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సానుకూల వాతావరణం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొనడం గమనార్హం.
మంగళగిరి ‘దేశం’ డీలా!
Published Sun, Mar 30 2014 3:56 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement