ఈ రోగానికి మందేదీ? | What is the medicine for this diesies | Sakshi
Sakshi News home page

ఈ రోగానికి మందేదీ?

Published Wed, Sep 9 2015 4:37 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఈ రోగానికి మందేదీ? - Sakshi

ఈ రోగానికి మందేదీ?

సాక్షి ప్రతినిధి, కడప : ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్న వైద్యుల దృష్టి సంపాదనపై పడటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవా భావం తగ్గిపోతోంది. వచ్చామా.. సంతకం పెట్టామా.. ఓ రౌండ్ వేసి వెళ్లామా.. అన్నట్లు వారి దినచర్య ఉంటోంది. సంపాదనలో వైద్యుల మధ్య పోటీ పెరగడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వెరసి చిన్న చిన్న రోగాలకు సైతం రోగులు రోజుల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. మరో వైపు పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత శాపంగా మారింది. రిమ్స్ లాంటి ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో సైతం వివిధ విభాగాల్లో 197 మంది వైద్యుల కొరత ఉండటం గమనార్హం.

 కలగా మిగిలిన సూపర్ స్పెషాలిటీ వైద్యం
  చెన్నై, కర్నూలు, తిరుపతి, వేలూరు లాంటి నగరాలకు వెళ్లకుండా కడప గడపలోని రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందుతుందని భావించారు. ప్రజల ఆశ అలాగే ఉండిపోయింది. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, యురాలజీ విభాగాలకు చెందిన రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణం. భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు క్షతగాత్రులను రిమ్స్‌కు తీసుకువస్తే రెఫరల్ ఆస్పత్రిగానే దర్శనమిస్తోంది. ఇప్పటికీ ఎమ్మారై స్కానింగ్ అందుబాటులో లేదు. సీటీ స్కానింగ్ సేవలు మాత్రమే ఉన్నాయి.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వ్యాపించినా తాము మెరుగైన వైద్యం అందిస్తాం.. అధైర్య పడొద్దనే భరోసాను రిమ్స్ యంత్రాంగం ఇవ్వలేకపోయింది. రక్త పరీక్షల రిపోర్టులు సైతం సకాలంలో అందించలేని దుస్థితి నెలకొంది. పీజీ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి స్థాయి పని కల్పించలేని స్థితిలో రిమ్స్ యంత్రాంగం కొనసాగుతోంది.

 పేరుకే జిల్లా ఆస్పత్రి
  వైద్య విధాన పరిషత్ పరిధిలో ప్రొద్దుటూరులో 350 పడకల స్థాయి జిల్లా ఆస్పత్రి ఉంది. పేరుకు మాత్రమే జిల్లా ఆస్పత్రిగా ఉందని రోగులు వాపోతున్నారు. అయితే రోగులకు ఈసీజీ, ఎక్స్‌రే కూడా తీయలేని దుస్థితిలో ఆస్పత్రి కొనసాగుతోంది. 50 ఎంఎం ఎక్స్‌రే యూనిట్ మాత్రమే పనిచేస్తుండడంతో రోగుల చెంతకే ఆ యూనిట్‌ను తీసుకెళ్లి ఎక్స్‌రేలు తీయాల్సి వస్తోంది. వైద్యుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పదేళ్లుగా రేడియాలజీ నిపుణుడు లేడు. ఏరియా ఆస్పత్రులు సైతం అదే స్థితిలో కొనసాగుతున్నాయి. మొక్కుబడిగా వైద్య సేవలు అందిస్తున్నాయి. 

ఓవైపు వైద్యుల కొరత వేధిస్తుంటే.. ఉన్న వైద్యులు మధ్యాహ్నం 12 గంటలలోపే వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత వచ్చిన పేషంట్లకు అత్యవసర సేవలు అందడం లేదు. మైదుకూరు ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులకు గాను ఒకరు మాత్రమే సోమవారం విధుల్లో ఉన్నారు. రోజూ 550 మంది రోగులు హాజరవుతున్న రాయచోటిలో ఇద్దరు డాక్టర్లు మాత్రమే దర్శనమిచ్చారు. బద్వేల్  సీమాంక్ ఆస్పత్రిలో తాగు నీరు సైతం అందుబాటులో లేదు. రోగులే ఇంటి నుంచి బాటిల్‌లో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

అంబులెన్స్ మరమ్మతులకు నోచుకోలేదు. మార్చురీ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టుమ్ కోసం జిల్లా కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వసతుల లేమి రోగులను ఇక్కట్లకు గురిచేస్తోంది. చాలా ఆస్పత్రుల్లో ల్యాబ్ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగు తీస్తున్నారు. ఇక మందుల పరిస్థితీ ఆంతంతే. ముఖ్యమైన మందులు బయట తెచ్చుకోక తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement