కాలర్లు పట్టుకొని అడిగితే కిరణ్, చంద్రబాబు ఏం చెబుతారు?: జగన్
వి.కోట: చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుల కాలర్లు పట్టుకుంటే ఏం సమాదానం చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ను వదిలి వెళ్లిపొమ్మని శాసిస్తున్నారు. విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అధిక ఆదాయం వచ్చే, ఉపాధి అవకాశాలు ఉన్న హైదరాబాద్ విడిపోయిన తరువాత చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్యాకేజీలు కోరుతున్న చంద్రబాబు, సీఎం కిరణ్లను కాలర్ పట్టుకొని అడిగితే ఏం చెబుతారని అడిగారు. హైదరాబాద్ నగరం మనందరిదని, దాని కోసం మనం అందరం కొట్టుకు చావాలా? అని అడిగారు.
దారుణాలకు పాల్పడుతున్న పాలకులను, వారి ఓట్ల రాజకీయాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. కాంగ్రెస్, టిడిపిలు ప్రజల జీవితాలతో చదరంగం ఆడుతున్నాయని అన్నారు. సోనియా గాంధీ తన కొడుకుని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విడగొడుతోందని చెప్పారు. ఆమెకు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపో్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగువాడు కన్నెర్ర చేస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతాడని తెలియజెప్పాలని పిలువు ఇచ్చారు. 30 ఎంపి స్థానాలు గెలుచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అన్నారు.
సభలో జగన్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు వైఎస్ఆర్ సిపిలో చేరారు. అంతకు ముందు వి.కోటకు చేరుకున్న జగన్కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు భారీగా తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో వి.కోట దద్దరిల్లింది.