ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు? | When is the APPSC Notifications? | Sakshi

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇంకెప్పుడు?

Published Mon, Nov 5 2018 3:34 AM | Last Updated on Mon, Nov 5 2018 3:34 AM

When is the APPSC Notifications? - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విడుదల ఎప్పుడన్నది తేలడం లేదు. ఈ నాలుగున్నరేళ్లలో 2016లో ఒకే ఒక్కసారి 4,275 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులోనూ 2 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. తక్కినవన్నీ ఖాళీగానే మిగిలిపోయాయి. మళ్లీ ఇప్పటివరకు నోటిఫికేషన్ల ఊసెత్తలేదు. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఎట్టకేలకు సెప్టెంబర్‌ 19న 18,450 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించింది.

ఇందులో కొన్ని పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, మరొకొన్ని పోలీస్‌ రిక్రూట్‌మెంట్, విద్యాశాఖ, సంక్షేమ గురుకులాల విభాగాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. కానీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర దాటుతున్నా రోస్టర్‌ వారీగా సమాచారం ఖరారు చేయించి నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేయిస్తోంది. కీలకమైన గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 సహా అనే శాఖలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ ఆయా శాఖల నుంచి తగిన సమాచారం లేకపోవడంతో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసి, సమావేశాలు నిర్వహించినా కొన్ని శాఖలు మాత్రమే స్పందించాయి. మరోవైపు విద్యాశాఖకు సంబంధించి గతనెల 26న డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడగా, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవలే కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది.

తేలని గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టుల జాబితా
ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో గ్రూప్‌1 పోస్టులు 182, గ్రూప్‌–2 337, గ్రూప్‌ 3 పోస్టులు 1670 ఉన్నాయి. అన్ని శాఖల నుంచి సమాచారం వస్తేనే ఈ పోస్టుల నోటిఫికేషన్ల విడుదలకు అవకాశం ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పంచాయతీరాజ్‌ వంటి కీలక శాఖల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. గ్రూప్‌–3లో పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖకు సంబంధించి జూనియర్‌ అసిస్టెంటు పోస్టులు ఉన్నాయి. అయితే జిల్లాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్ల సమాచారం ఇంకా ఏపీపీఎస్సీకి అందలేదు. ఇక గ్రూప్‌ 2లోని 337 పోస్టులకు  సంబంధించి అసెంబ్లీ సచివాలయం, జీఏడీ, ఆర్థిక, న్యాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.

గ్రూప్‌ 1లో గతంలో కేవలం 78 పోస్టులు మాత్రమే ప్రకటించగా ఈసారి వాటి సంఖ్య 182కు పెంచారు. ఇందులో రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్, రహదారులు, భవనాల శాఖల నుంచి పోస్టుల సమాచారం ఇంకా పూర్తిగా అందాల్సి ఉందని కమిషన్‌ వర్గాలు వివరించాయి. సమాచారం రాకపోవడంతో ఈ మూడు గ్రూప్‌ నోటిఫికేషన్ల విడుదల జాప్యమవుతోందని పేర్కొంటున్నాయి. లెక్చరర్లు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, తదితర పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి సమాచారం అందింనందున వారం పదిరోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలుంటందని చెబుతున్నాయి. నోటిపికేషన్ల విడుదలలో జాప్యంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement