గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనంపై ఉద్యమిస్తామని బీరాలు పలికిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గారు.
పీఛేముడ్..!
Published Thu, Sep 19 2013 4:05 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గ్రేటర్‌లో శివారు పంచాయతీల విలీనంపై ఉద్యమిస్తామని బీరాలు పలికిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గారు. గురువారం నుంచి నిరవధిక నిరాహారదీక్షలు చేపడతామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన నేతలు.. తర్వాత చూద్దామని తుస్సుమనిపించారు. తెలుగుదేశం పార్టీ నేత ల్లో నెలకొన్న అంతర్గత పోరే ‘దీక్ష’ల వాయిదాకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో 35 పంచాయతీలను కలపడం, మైనింగ్ జోన్, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్, ఏపీఐఐసీ భూ సేకరణను నిరసిస్తూ గురువారం నిరవధిక దీక్షకు దిగుతానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో మేలుకొన్న టీడీపీ ముఖ్యనేతలు కిషన్‌రెడ్డి పోరాటానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ నిరవధిక దీక్షలో తాము కూడా పాల్గొంటామని తేల్చిచెప్పిన నేతలు తాజాగా వెనక్కి తగ్గారు.
ఆందోళన కార్యక్రమాలకు కొన్నాళ్లు పుల్‌స్టాప్ పెడదామనే అంశాన్ని తెరమీదకు తె చ్చారు. గురువారం పంచాయతీల విలీనంపై హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించనున్న నేపథ్యంలో తీర్పును పరిశీలించిన తర్వాత ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే, జిల్లా కమిటీతో సంప్రదించకుండానే పంచాయతీల విలీనం సహా.. పలు సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్న మంచిరెడ్డికి సొంత పార్టీలోనే చుక్కెదురైంది. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌లో మైనింగ్ జోన్, ఏపీఐఐసీ భూసేకరణతో వేలాది మంది రైతులు రోడ్డున పడుతున్నారని, అదే సమయంలో జిల్లా ఉనికికి భంగం కలిగేలా గ్రేటర్ పరిధిని విస్తరిస్తుండడాన్ని నిరసించాలని నిర్ణయిస్తే సొంత పార్టీ నాయకులే మోకాలడ్డడంపై ఆయన వర్గీయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిరవధిక దీక్షతో కిషన్‌రెడ్డికి ఎక్కడ క్రెడిట్ వస్తుందోననే బెంగతోనే తాము కూడా దీక్షలో పాల్గొంటామని ప్రకటనలు చేసిన వైరివర్గం.. ఇప్పుడు అర్ధంతరంగా దీక్షలను వాయిదా వేద్దామని సూచించడం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది.
ఆందోళన పథంలో..
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లా టీడీపీలో స్తబ్ధత నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా మనం లేఖ ఇచ్చినందునే రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చినప్పటికీ, జిల్లా నేతలు ఆ దిశగా ముందడుగు వేయడంలేదు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణ అంశంపై పార్టీ నాయకులు ఆచితూచి అడుగేస్తున్నారు. కొన్నాళ్లుగా సీనియర్ల మధ్య కొనసాగుతున్న అభిప్రాయభేదాలు కూడా పార్టీని పలచన చేస్తున్నాయి. ఈ తరుణంలోనే పలువురు నాయకులు టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆర్నెల్ల క్రితం జరిగిన సహకార ఎన్నికల్లోనూ దిగువస్థాయి నేతల కృషి వల్ల మెజార్టీ సొసైటీలను గెలుచుకున్నప్పటికీ, ముఖ్య నేతల మ్యాచ్‌ఫిక్సింగ్‌తో అధికారపార్టీ డీసీసీబీ, డీసీఎంఎస్‌ను ‘చే’జిక్కించుకుంది. ఇలా పార్టీలో జరుగుతున్న కోవర్టు ఆపరేషన్లు నిలువరించే ప్రయత్నం పార్టీనేతలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రకటనతో డీలాపడ్డ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు పంచాయతీల విలీనాన్ని, తదితర అంశాలను అనువుగా మలుచుకోవచ్చని మంచిరెడ్డి ఎత్తు వేశారు. పంచాయతీల విలీనంపై అధికారపార్టీ సహా అన్నిపార్టీలు వ్యతిరేకిస్తున్నందున ఈ అంశంపై ప్రజల్లోకి వెళితే మంచి మైలేజీ దొరుకుతుందని భావించారు.
మంచిరెడ్డి ఆలోచనకు తొలుత తలూపిన పార్టీ ఎమ్మెల్యేలు.. చివరి నిమిషంలో చెయ్యిచ్చారు. ప్రజాసమస్యలను అందిపుచ్చుకోవాల్సిన సమయంలో క్రెడిట్ పాకులాటలో పార్టీ నేతలు వాయిదా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుండగా, పంచాయతీల విలీనంపై గురువారం ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశమున్నందున దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement