ఒంటరి పోరు తప్పదా?
మజ్లిస్ ప్రకటనలతో టీఆర్‌ఎస్‌లో గుబులు
ఒంటరిగానే గ్రేటర్ ఎన్నికల్లోకి..
ఎంఐఎంతో అవగాహనైనా ఉంటుందని ఆశలు
హైదరాబాద్: గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న తెలంగాణ రాష్ర్ట సమితి(టీఆర్‌ఎస్) ఇప్పుడు ఏకంగా ‘గ్రేటర్’ పీఠాన్నే కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏడాది కాలంగా గ్రేటర్‌లో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ముందుకెళుతోంది. జంట నగరాల్లో బలంగా ఎంఐఎంతో అవగాహనతో ముందుకెళుతూనే మరోపక్క తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తూ వస్తోంది. అయితే, ఇప్పటివరకు అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తోన్న ఎంఐఎం గ్రేటర్ ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతామని ఆ పార్టీ అధినేత స్వయంగా స్పష్టం చేయడం గులాబీ శిబిరంలో గుబులురేపుతోంది. వాస్తవానికి హైదరాబాద్ గ్రేటర్‌గా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లో కానీ, అంతకు ముందు జరిగిన ‘మున్సిపల్’ ఎన్నికల్లో కానీ ఎంఐఎం ఏపార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అవగాహనతో వెళ్లిన ఎంఐఎం ఆ పార్టీతో కలసి గ్రేటర్ పీఠాన్ని పంచుకుంది.
పొత్తు కాదు ... అవగాహనే..
నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ రాష్ర్టవ్యాప్తంగా స్థానిక సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ప్రధాన దృష్టి పెట్టింది. కొన్నింటిని స్వతహాగా చేజిక్కించుకోగా, మరికొన్నింటిని ‘అధికారహోదా’లో దక్కించుకుంది. కానీ, రాజధాని హైదరాబాద్‌లో మాత్రం పూర్తిస్థాయిలో పట్టుసాధించాలన్న వ్యూహంతో పార్టీ నాయకత్వం ఉంది. గ్రేటర్‌లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఇప్పటికే అనేక ఎత్తులు వేసింది. ఎంఐఎంతో ముందునుంచీ స్నేహంగానే ఉంటూ వస్తోంది. ఆ పార్టీ ఏది కోరినా తీరుస్తూనే ఉంది. దీంతో గ్రేటర్‌లో ఎంఐఎంతో కలిసే పోటీచేస్తామని ఇప్పటిదాకా గులాబీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. ఎంఐఎంతో అంటకాగొద్దని, ముస్లిం మైనారిటీల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలే గట్టెక్కిస్తాయని టీఆర్‌ఎస్‌లో ముస్లిం నేతలు చెబుతున్నా ఎంఐఎంతో స్నేహపూర్వకంగా ఉంటూనే వచ్చింది. ఎంఐఎం ప్రకటన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని దాదాపు తేలిపోయింది. టీఆర్‌ఎస్‌లో ముస్లిం నాయకులు మాత్రం ఎంఐఎంతో కలసి పోటీ చేయడం వల్ల తమకు అవకాశాలు రాకుండా పోతాయని భావించారు. దీంతో ఓల్డ్‌సిటీలో పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని విజయవంతం చేశారు. ఇదిలాఉండగా, ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు లేకపోయినప్పటికీ అవగాహన మాత్రం ఉంటుందని అధికార పార్టీ నేతలు ఆశావహ దృక్పథంతో ఉన్నారు.
గ్రేటర్‌కు ... గులాబీ గురి
గ్రేటర్‌పై గురిపెట్టిన అధికార టీఆర్‌ఎస్ ముందుగా డివిజన్ల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. 2011 జనాభా లెక్కల మేరకు డివిజన్లను 150 నుంచి 200కు పెంచే పనిలో పడింది. గడిచిన ఏడాది కాలంగా స్పెషల్ అధికారి పాలనలో ఉన్న గ్రేటర్‌కు ఈ ఏడాది చివరి నాటికల్లా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కనీసం 101 డివిజన్లలో గెలవాలి. ఈ కారణంగానే హైదరాబాద్‌లో కొంత ప్రాబల్యం ఉన్న టీడీపీని బలహీన పరిచే వ్యూహాన్ని టీఆర్‌ఎస్ అనుసరించింది. నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని పార్టీలో చేర్చుకుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 5, ఎంబీటీ 1, పీఆర్‌పీ 1 స్థానంలో గెలవగా, కాంగ్రెస్, ఎంఐఎం అవగాహనతో అధికారం పంచుకున్నాయి. ఈసారి కూడా ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశాలు తక్కువ కాబట్టి, అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎం కచ్చితంగా ఎన్నికల అవగాహనతో వెళతాయని విశ్లేషిస్తున్నారు.