మద్దతిస్తాం కానీ...
టీఆర్‌ఎస్‌తో మైత్రీ బంధం కొనసాగింపు
అవసరమైతే సమస్యలపై గళం
మజ్లిస్ పార్టీ నిర్ణయం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పాలక వర్గంలో భాగస్వామ్యాన్ని పంచుకోలేకపోయినా.....అధికార టీఆర్‌ఎస్‌తో మిత్ర పక్షంగా కొనసాగాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. గురువారం జీహెచ్‌ఎంసీ సమావేశ మందిరంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్‌లకు మద్దతు ప్రకటిస్తున్నట్లు మజ్లిస్ పార్టీ అహ్మద్ నగర్ కార్పొరేటర్ ఆయేషా ఫాతిమా వెల్లడించారు. దీంతో పాలక పక్షానికి మజ్లిస్ మద్దతు మరింత బలం చేకూర్చినట్లయింది.
మిత్ర పక్షమే
జీహెచ్‌ఎంసీలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీమజ్లిస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు సిద్ధం కాకుండా... అధికార టీఆర్‌ఎస్‌తో గల అనుబంధం దృష్ట్యా మిత్ర పక్షంగా మారింది. ఎన్నికల్లో ఇరుపక్షాల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు లేకపోయినా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్‌ను మిత్రపక్షంగా అభివర్ణించారు. మేయర్ పీఠం విషయంలో అవసరమైతే ఆ పార్టీ మద్దతు తీసుకుంటామని ప్రకటించారు. పూర్తి స్థాయి మెజార్టీ దక్కడంతో అధికార పార్టీకి మజ్లిస్ సహకారం అవసరం లేకుండా పోయింది. అయినప్పటికీ మజ్లిస్ పార్టీ మేయర్, డిప్యూటీల ఎన్నికల్లో మద్దతు ప్రకటించి మిత్రబంధాన్ని మరింత దృఢం చేసింది.
ప్రజల పక్షం
అధికార పార్టీకి మిత్రపక్షమైనప్పటికీ ప్రజల పక్షాన గళం విప్పాలని మజ్లిస్ నిర్ణయించింది. పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పూర్తి స్థాయి ప్రాతినిథ్యం కలిగి ఉంది. తాజాగా కొత్త నగరంలోనూ కొన్ని డివిజన్లలో పాగా వేసింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాదు... పాలక వర్గం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే... వాటినీ ఎండగట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కార్పొరేటర్ల సమావేశం
మేయర్ ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు గురువారం ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీలో వారు వ్యవహరించాల్సిన తీరుపై అగ్ర నాయకులు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలసి గ్రూప్ ఫొటో దిగి.. జీహెచ్‌ఎంసీకి బయలుదేరారు.