కారు పయనమెటువైపు?
పొత్తా, విలీనమా, ఒంటరి పోరా?
ఇప్పటివరకు స్పష్టతనివ్వని కేసీఆర్
తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదాకా ఉత్కంఠ తప్పదంటున్న శ్రేణులు
ఆమోదం పొందితే కాంగ్రెస్‌తో విలీనం తప్పదని భావన నెలాఖరులో కేసీఆర్ ఢిల్లీ పర్యటన!
సాక్షి, హైదరాబాద్:
కాంగ్రెస్‌లో విలీనం అంశంపై తనదైన స్టైల్‌లో స్పందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు చుక్కలు చూపిస్తున్నారు. తెలంగాణ కల సాకారమైతే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని గతంలో పలుమార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీ మనుగడపై ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ పార్టీ నేతల్లో ఉత్కంఠను, ఆందోళనను పెంచుతున్నారు. మనసులోని మాటను ఎక్కడా స్పష్టంగా బయటపెట్టడం లేదు. కేసీఆర్ మదిలో ఏముందో, ఎలాంటి నిర్ణయం పేలుస్తాడో, తమ రాజకీయ భవిష్యత్తు ఎమిటో.. అని పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ బిల్లు ఆమోదంపై స్పష్టత వచ్చేదాకా ఈ ఉత్కంఠ తప్పదని, అప్పటిదాకా కేసీఆర్ మౌనం తప్పదని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ టీఆర్‌ఎస్ ముందు ఎలాంటి ప్రతిపాదన పెట్టినా కాదనలేమనే భావనలో కేసీఆర్ ఉన్నారని, సోనియాగాంధీతో కేసీఆర్ సమావేశమయ్యేదాకా ఈ అనిశ్చితి తప్పదని భావిస్తున్నారు.
మద్దతు కోసం ఢిల్లీకి
తెలంగాణ బిల్లు ఈ నెల 23 తర్వాత ఢిల్లీకి వెళ్లనుంది. అదే సమయంలో పార్లమెంటులో మద్దతుకోసం జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల అధినేతలను, లోక్‌సభలో ఆ పార్టీల నేతలను కలవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. దీనికోసం ఈ నెలాఖరులోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండొచ్చునని పార్టీ నేతలు తెలిపారు. సోనియాతోనూ కేసీఆర్ ఆ సమయంలోనే భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీ మనుగడపై కేసీఆర్ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని, ఢిల్లీ ‘పెద్దల’తో కేసీఆర్ ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉన్నారని వారంటున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని, ఢిల్లీ పెద్దలతో కొనసాగుతున్న చర్చల వివరాలను ఆయన ఎవరితోనూ పంచుకోవడం లేదని చెబుతున్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత.. రాజకీయపార్టీగా టీఆర్‌ఎస్‌కు ఉన్న అవకాశాలు, పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై అంతర్గతంగా తర్కించుకుంటున్నారు. పార్టీ నేతల మధ్య వస్తున్న వాదనలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్‌లో విలీనం
సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా తెలంగాణపై నిర్ణయం తీసుకుని, అమలు చేసినందుకు రాజకీయ ఫలాలను కాంగ్రెస్ ఆశిస్తే తప్పులేదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అటు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోనూ నష్టపోవాలా? తెలంగాణ ఇచ్చినందుకు పార్టీ విలీనం చేయాలని సోనియాగాంధీ స్వయంగా అడిగితే కాదనడం సరికాదు. అయితే దీని వల్ల పార్టీలో ఇప్పటిదాకా పనిచేసిన నేతలందరికీ రాజకీయ అవకాశాలు రాకపోవచ్చు. ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగే ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌తో సైద్ధాంతికంగా విభేదిస్తున్న నాయకులు మరోదారి చూసుకునే అవకాశమూ ఉంది.
కాంగ్రెస్‌తో పొత్తు
పొత్తు వల్ల అవకాశాలు రాని నియోజకవర్గాల్లోని నేతలు ఇతర పార్టీల్లోకి వలసపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో పొత్తుకు, విలీనానికి పెద్దగా తేడా ఉండకపోవచ్చు. అయితే పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంటుందా? కాంగ్రెస్‌తో పొత్తుద్వారా వచ్చిన సీట్లతో కేసీఆర్ రాజకీయ జిమ్మిక్కులు చేస్తాడనే భయం కాంగ్రెస్‌లో ఉండదా?
బీజేపీతో పొత్తు
బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అనే అనుమానం వస్తే తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలోచనలోనే మార్పు రావొచ్చు. సీమాంధ్రలో రాజకీయంగా ఎంతో నష్టపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో టీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనంకోసం తెలంగాణ ఏర్పాటుచేస్తుందా? ఒకవేళ తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీజేపీతో కలిసిపోయినా తెలంగాణ ఇచ్చినవారిపై కృతజ్ఞత లేదనే కారణంతో టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది. తెలంగాణలోని దాదాపు 30 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న మైనారిటీ ఓట్లు కూడా కీలకమే.
ఒంటరి పోరు
ఈ నిర్ణయం కేసీఆర్‌కు కూడా నచ్చకపోవచ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి తెలంగాణలో కృతజ్ఞత చూపిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక రెండు పార్టీలకూ నష్టమే. టీఆర్‌ఎస్‌కు అధికారం రాదనే అంచనా పార్టీ శ్రేణులకు వస్తే పార్టీకి మరింత నష్టం కలుగుతుంది.