తీవ్ర ఒత్తిడిలో కేసీఆర్
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లు రోజుకో మలుపు తీసుకోవటం, అది టీఆర్‌ఎస్‌కు కీలకమైన రాజకీయ భవితవ్యంతో ముడివడిన అంశం కావటంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. బిల్లుపై ముందుకువెళ్లటానికి ముందుగానే టీఆర్‌ఎస్ ‘రాజకీయ నిర్ణయాల’పై కాంగ్రెస్ నుంచిపెరుగుతున్న ఒత్తిడి కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలోకి పార్టీ ముఖ్యులనూ అనుమతించటం లేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీలనే కాదు.. సన్నిహితంగా ఉన్నవారిని కూడా కేసీఆర్ కలవటానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్డులోని కేసీఆర్ నివాసం బయట రోడ్డుపైన కొందరు రాష్ట్ర నేతలు పడిగాపులు పడుతుంటే.. మరికొందరు ఇంటి కాంపౌండు లోపల ఏర్పాటుచేసిన టెంటులో కూర్చుని నిరీక్షిస్తున్నారు.
ఎవర్నీ ఆ టెంటు దాటి అనుమతించటం లేదు. పార్టీ అధినేత దృష్టిలో పడటానికి హైదరాబాద్ నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలను, రాష్ట్ర పార్టీ నేతలను కేసీఆర్ కసురుకుంటున్నట్లు చెప్తున్నారు. రోజంతా కేసీఆర్ నివాసంలోనే గడిపేవారినీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ ఆయన స్వయంగా ఆదేశించారని, ఆయన వ్యక్తిగత సహాయకులుగా ఉన్న కుటుంబసభ్యులు ఈసడించుకుంటున్నారని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. మీడియాను గేటుదాటి లోపలికి రానీయొద్దంటూ కేసీఆర్ గట్టిగా ఆదేశాలు ఇచ్చారని వ్యక్తిగత సహాయకులు చెప్తున్నారు. ఇదిలావుంటే.. టీ బిల్లుపై బీజేపీ వైఖరి, వ్యతిరేకంగా ఉన్న పార్టీల తీరు, సీమాంధ్ర నేతల లాబీయింగ్ వంటి అంశాలతోపాటు.. బిల్లు పార్లమెంటుకు ఎప్పుడు వస్తుంది? అనే అంశాలపై కేసీఆర్ ఎప్పటికప్పుడు జాతీయ నేతలతో సంప్రదిస్తున్నట్టు సమాచారం.