4 నుంచి రంగంలోకి!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై తదుపరి ఘట్టాలన్నీ ఇక హస్తిన కేంద్రంగా సాగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ నెల 4న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ కానున్నారు. ఆ భేటీ ముగిశాకే కాంగ్రెస్ ముఖ్యులు, ప్రతిపక్ష నేతలతో భేటీలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బిల్లులో కేంద్రం పొందుపరిచిన కొన్ని అంశాలపై అభ్యంతరం తెలుపుతున్న కేసీఆర్... వాటిపై సవరణలకు ప్రధాని నుంచి గట్టి హామీ పొందాలని యోచిస్తున్నారు. ఇవే సవరణలకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కోర్ కమిటీ నేతలు ఏకే ఆంటోనీ, ఆజాద్, షిండేలతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లను కలిసి విన్నవించే అవకాశాలు ఉన్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో పాటు యూపీఏ, ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పక్షాలను కలిసి బిల్లుకు సంపూర్ణ మద్దతుతోపాటు సవరణలకు ఆమోదం దక్కేలా చూడాలని విన్నవించనున్నట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతుండటం, 6న విభజన బిల్లుపై కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నందున అంతకుముందే వీలైనన్ని ఎక్కువ భేటీలు జరుపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు సవరణలపై పట్టు: కేసీఆర్ ప్రధానంగా మూడు సవరణలకు గట్టిగా పట్టుబడుతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 1. శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఉన్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఇవ్వాలని కోరడం. 2.ఆస్తులు, అప్పులను జనాభా దామాషా ప్రకారం కాకుండా ఏ ప్రాజెక్టు కోసం అప్పు తెచ్చారో ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతానికే అప్పులు చెందేలా చూడడం. 3. స్థానికత ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్ల విభజన ఉండాలి. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నష్టపోయినందున మళ్లీ ిపింఛన్ల భారాన్ని మోపరాదు. బిల్లులోని మరికొన్ని అంశాలకు సవరణలు కోరుతున్నా.. ప్రధానంగా ఈ మూడింటిపైనే ఒత్తిడి చేయనున్నారని పార్టీ కీలక నేత ఒకరు తెలిపారు. శనివారం పూర్తిగా తన నివాసంలోనే విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ సాయంత్రం మాత్రం పార్టీ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, విద్యాసాగర్, ఓదేలు, వినయ్ భాస్కర్, భిక్షపతి, వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌లతో కాసేపు సమావేశమయ్యారు.
వీలును బట్టి జీవోఎంతో: విభ జన బిల్లుపై అసెంబ్లీలో వెల్లడైన అభిప్రాయాల క్రోడీకరణ పూర్తయి, అవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర హోంశాఖకు సోమవారం నాటికి చేరే అవకాశం ఉంది. అవి చేరిన రోజే అంటే సోమవారం ఉదయం కానీ, సాయంత్రం కానీ వీలును బట్టి మంత్రుల బృందం (జీవోఎం) నేతలతో భేటీ కావాలని టీఆర్‌ఎస్ నేతలు యోచిస్తున్నారు.