నల్లబజారుకు ‘తెల్ల’ బియ్యం | White card Grain bought | Sakshi
Sakshi News home page

నల్లబజారుకు ‘తెల్ల’ బియ్యం

Published Sun, Nov 2 2014 1:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

నల్లబజారుకు ‘తెల్ల’ బియ్యం - Sakshi

నల్లబజారుకు ‘తెల్ల’ బియ్యం

తుని :సంక్షేమ లక్ష్యం చెదిరిపోతోంది. బడుగుల కడుపు నింపాల్సిన గింజలు.. బడాబాబుల కలిమిని పెంచుతున్నాయి. తెల్లకార్డులపై కారుచౌకగా ప్రభుత్వం ఇస్తున్న బియ్యం.. నల్లబజారుకు తరలిపోతోంది. అక్కడ కొంత నగిషీలు పెట్టుకుని, రెట్లు, రెట్లుగా ధర పెంచుకుంటోంది. అక్రమార్కుల పంట పండిస్తోంది.  జిల్లాలో పలుచోట్ల రైసుమిల్లుల్లో కొద్దిరోజులుగా పట్టుబడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యమే ఇందుకు తిరుగులేని తార్కాణం. ఎన్ని నిఘాలున్నా.. ఈ నేరం నిరాఘాటంగా జరిగిపోవడానికి అధికారుల అలసత్వం, అవినీతి కూడా కారణమని చెప్పక తప్పదు. తెల్లకార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు దక్కించుకుని, రీ సైక్లింగ్ చేసి లక్షలు దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో రైస్ మిల్లుల యజమానులతో పౌరసరఫరాల శాఖ అధికారులు మిలాఖత్ అయ్యారన్న ఆరోపణలు ప్రబలంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మధ్యమధ్య పీడీఎస్ బియ్యం రైలు మిల్లుల్లో పట్టుబడుతూనే ఉంది. కోటనందూరులో గురువారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ రైసుమిల్లుపై జరిపిన దాడిలో 759 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది.
 
 ఇలా సేకరిస్తున్నారు..
 మార్కెట్‌లో సూపర్ ఫైన్ రకం బియ్యం ధర చుక్కల్లో ఉంది. క్వింటాల్ రూ.నాలుగు వేలకు పైనే పలుకుతోంది. రైతుల నుంచి ధాన్యం కోనుగోలు చేసి, మిల్లింగ్ చేసి, బియ్యం విక్రయిస్తే వచ్చే లాభాల కన్నా పీడీఎస్ బియ్యాన్ని అడ్డదారుల్లో సేకరించి, కాస్త మెరుగు పెట్టి అమ్మితే వచ్చే లాభాలు ఎన్నో రెట్లు ఎక్కువ. దీంతో కొంత మంది వ్యాపారులు పీడీఎస్ బియ్యంపై దృష్టి సారించారు. తూర్పు, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న కోటనందూరును అక్రమ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నారు. తుని, పాయకరావు పేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో తెల్లకార్డుదారులకు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఎంపిక చేసిన దళారుల ద్వారా సేకరిస్తున్నారు.
 
 ప్రభుత్వం పేదలకు ఇస్తున్న బియ్యం ధర నామమాత్రంగానే ఉంది. చాలా మంది రేషన్ కార్డుల ద్వారా బియ్యాన్ని తీసుకోవడం లేదు. కొంత మంది తీసుకున్న బియ్యాన్ని వ్యాపారులకు అమ్మేస్తున్నారు. రేషన్ డిపోల డీలర్లు కూడా కార్డుదారులు తీసుకు వెళ్లని పీడీఎస్ బియ్యాన్ని ఇలాంటి దళారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పీడీఎస్ బియ్యాన్ని దళారులు క్వింటాల్ రూ.1200 నుంచి రూ.1400 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లుల్లో మరోసారి మరపట్టించి,  వివిధ బ్రాండ్ల పేరుతో హెచ్చురేట్లకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. కోటనందూరు మండలంలో గతేడాది మార్చిలో విశాఖపట్నం నుంచి తీసుకువచ్చిన 179 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
 
 తాజాగా గురువారం 759 క్వింటాళ్లు బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ బియ్యం తుపాను బాధితుల కోసం పంపినదని తొలుత అధికారులు భావించారు. అయితే స్థానికుల సమాచారం మేరకు అవి తుని పరిసర ప్రాంతాల్లో రేషన్ దుకాణాల నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తుని నియోజకవర్గంలో నెలకు పీడీఎస్ ద్వారా 9,425 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇదే నిష్పత్తిలో ఇతర నియోజకవర్గాల్లోనూ సరఫరా జరుగుతుంది. ఈ బియ్యంలో ఎక్కువ శాతం దళారులు, చిరు వ్యాపారులు కొనుగోలు చేసి రైసుమిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప అధికారులు తనిఖీలు చేయడం లేదు. కాగా కోటనందూరు సంఘటనతో నిఘా పెంచామని, తూర్పు- విశాఖ జిల్లాల  సరిహద్దులో తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ ఎస్పీ రమేషయ్య చెప్పారు. ఏదేమైనా ప్రభుత్వం సత్సంకల్పంతో, వ్యయానికోర్చి ఇస్తున్న బియ్యం ఇలా.. లక్ష్యం చేరడం మాని, కొందరికి లక్షలు తెచ్చి పెట్టడాన్ని అరికట్టాలంటే అన్ని వ్యవస్థలూ కఠినంగా  వ్యవహరిస్తేనే సాధ్యం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement