చివరి సీఎం ఎవరో?
రాష్ట్రపతి పాలన కంటే ప్రభుత్వ ఏర్పాటు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో ‘సీఎం’ ఆశావహుల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు పీఠం దక్కిన వారే సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కానుండటంతో అది ఎవరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నేతలూ పోటీలో ఉన్నా సీమాంధ్రకే, అందులోనూ కాపు సామాజిక వర్గానికి ఈసారి అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ బొత్స కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది.
బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని, అనంతరం 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ ఉంటుందని అంటున్నారు. మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా సీమాంధ్ర మంత్రులు, సీనియర్ నేతలకు దిగ్విజయ్ నుంచి తాఖీదు అందింది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం దామోదరతో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి తదితరులతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా సీఎంగిరీ కోసం ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది పార్టీలో చర్చనీయంగా మారింది. రాష్ట్ర విభజనకు పార్లమెంట్ ఆమోదముద్ర పడ్డా సాధారణ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేయడంతో పగ్గాలను ఎవరికి అప్పగించాలన్న అంశంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నా, జూన్ 1 వరకైనా పదవిలో ఉండొచ్చనే ఉద్దేశంతో ఇరు ప్రాంతాల నేతలూ సీఎం పీఠంపై గంపెడాశలు పెట్టుకున్నారు. విభజన జరిగిన నేపథ్యంలో తమ ప్రాంతానికే సీఎం పదవి ఇవ్వాలని తెలంగాణ నేతలు ప్రతిపాదిస్తున్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది గనుక తమకే ఆ అవకాశమిస్తే ఈ సమయంలో పార్టీని కొంతవరకైనా గాడిలో పెట్టొచ్చని ఆ ప్రాంత నేతలు వాదిస్తున్నారు. కొద్దిరోజులుగా దీనిపై మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పెద్దలు చివరికి సీమాంధ్ర నేతనే సీఎం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కాపు వర్గానికి చెందిన నేతను అందుకు ఎంపిక చేయాలని కూడా వారు భావిస్తున్నారు. అధిష్టానం నుంచి ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినట్టు పలువురు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమైన సందర్భంగా సీమాంధ్రలో పార్టీ బలోపేతానికి చర్యలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు తదితరాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. వాటిపై సీమాంధ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరముందని చెప్పిన దిగ్విజయ్.. అక్కడి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలంతా మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో అందుబాటులో ఉండేలా చూడాలని బొత్సకు సూచించారు. సోమవారం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజులతో సమావేశమై, రెండు, మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని సూచించారు. దాంతో వారంతా దీని వెనక మతలబేంటని ఆరా తీసే పనిలో పడ్డారు. అక్కడి నుంచి వస్తున్న సంకేతాల మేరకు... బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుంది. మంగళవారమే జరపాలని భావించినా కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశాల్లో ఉండటంతో వీలవలేదని తెలిసింది. సీఎం అభ్యర్థి ఎంపికపై కోర్ కమిటీలో నిర్ణయానికి వచ్చాక, 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
మార్చి 10 లోపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడటం ఖాయమవడం, అంతకుముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించడంతో తెలంగాణ, సీమాంధ్ర నేతలు సీఎంగిరీ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. సీమాంధ్ర వ్యక్తికి, అందులోనూ కాపు సామాజిక నేతకే అవకాశం దక్కుతుందన్న సంకేతాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, మంత్రులు బొత్స, కన్నా లక్ష్మీనారాయణ రేసులో ఉన్నారు. వీరిలో చిరంజీవి, కన్నా పేర్లు పార్టీలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ వ్యక్తికే సీఎం పగ్గాలు అప్పగించాలని తెలంగాణ నేతలూ ఒత్తిడి తెస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా భారీగా లాబీయింగ్ చేస్తున్నారు. దామోదర సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లను కలిసి దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి షిండే, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ద్వారా కూడా ఆయన లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. బీసీ నేతకు సీఎం పగ్గాలు అప్పగించడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించవచ్చని డీఎస్ వంటి నేతలు హైకమాండ్‌కు ప్రతిపాదిస్తున్నారు.