నాలుగో కృష్ణుడిపై సర్వత్రా ఆసక్తి!
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హస్తినకు చేరాయి. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఢిల్లీలో మకాం వేసి సీఎం పీఠం కోసం ఎవరికి వారే జోరుగా పైరవీలు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల నేతలు అధిష్టానం పెద్దలతో భేటీ కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రపతి పాలన కంటే ప్రభుత్వ ఏర్పాటు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో ‘సీఎం’ ఆశావహుల సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది.
తెలంగాణ నేతలూ పోటీలో ఉన్నా సీమాంధ్రకే, అందులోనూ కాపు సామాజిక వర్గానికి ఈసారి అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ బొత్స కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో కేంద్రమంత్రి చిరంజీవి మంగళవారం భేటీ అయ్యారు. మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కూడా అందుబాటులో ఉండాలని సోనియా కార్యాలయం నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే హస్తినలో మకాం వేసిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే మంత్రులు ముఖేష్ గౌడ్, డీకె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈరోజు ఉదయం దిగ్విజయ్ సింగ్ను కలిశారు. బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని, అనంతరం 27 లేదా 28 తేదీల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ ఉంటుందని అంటున్నారు.
మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో అందుబాటులో ఉండాల్సిందిగా సీమాంధ్ర మంత్రులు, సీనియర్ నేతలకు దిగ్విజయ్ నుంచి ఇప్పటికే తాఖీదు అందింది. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం దామోదరతో పాటు మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి తదితరులతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా సీఎంగిరీ కోసం ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు పీఠం దక్కిన వారే సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కానుండటంతో అది ఎవరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.