ఎవరిని కదిపినా సమైక్యాంధ్ర భవిష్యత్‌పై ఆందోళన. నలుగురు గుమికూడితే విభజన చిచ్చుపైనే చర్చ. పాఠశాలలకు వెళ్లే పిల్లలైనా.. కళాశాలల విద్యార్థులైనా లక్ష్యం ‘సమైక్య’మే. ఇక ఉద్యోగులు.. కార్మికులు.. ప్రజా సంఘాలు.. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ కార్యాచరణలో తలమునకలవుతున్నారు. నిరసనలు భిన్నమైనా.. ఆందోళన దారులు వేరైనా.. అందరి నినాదం ఒక్కటే. ఊరూవాడా ఏకమై.. పోరుబావుటా ఎగురవేసి.. కదంకదిపి.. గళం కలిపి సమైక్య దండు కదులుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమవాణి వినిపిస్తోంది.
సాక్షి, కర్నూలు: క్రిష్ణాష్టమి పర్వదినమైన బుధవారం రోజునా సమైక్యాంధ్ర ఉద్య మం ఉవ్వెత్తున ఎగిసింది. జిల్లా అంతటా ఉద్యమకారులు విభిన్న రీతుల్లో ఆందోళనలు నిర్వహించారు. నగరంలో సమైక్యవాదులు నిరసనలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ ప్రసూతి వైద్యులు నడిరోడ్డుపైనే రోగులను పరీక్షించారు. కార్యక్రమంలో వైద్యులు విజయశంకర్, రంగనాథ్, శ్రీహరి, మనోహర్, జయరాం, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ టౌన్ మోడల్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు ప్రధానమంత్రికి రాష్ట్రాన్ని విభజించొద్దంటూ పోస్టుకార్డులు పంపారు. ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుటనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి కట్టిన సమైక్య ఉట్టిని శ్రీకృష్ణుడి వేషాధారుడితో కొట్టించారు. కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర పరిరక్షణ వేదిక చేపట్టిన సామూహిక దీక్షలకు రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ సంఘీభావం ప్రకటించింది. హౌసింగ్‌బోర్డు మహిళా వర్క్ ఇన్‌స్పెక్టర్లు కర్నూలు-అనంతపురం ప్రధాన రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేసి నిరసన తెలిపారు.
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కొత్తబస్టాండ్ నుంచి బంగారుపేట, ఆర్‌ఎస్ రోడ్డు, వైఎస్‌ఆర్ సర్కిల్, పాత కంట్రోల్ రూమ్, పాత బస్టాండు చేరుకుని... తిరిగి రాజ్‌విహార్, కలెక్టరేట్ మీదుగా కొత్తబస్టాండ్‌కు చేరుకుంది. ఆదోనిలో పొదుపు మహిళలు పట్టణంలో ర్యాలీ నిర్వహించి భీమాస్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. జేఏసీ ఆధ్వర్యంలో భీమాస్ సర్కిల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. న్యాయవాదులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో వార్డెన్‌లు రిలే నిరాహరదీక్ష నిర్వహించారు. రజకులు రోడ్డుపై బట్టలు ఉతికి నిరసన తెలిపారు. రుద్రవరంలో జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు కొనసాగింది. పత్తికొండలో జేఏసీ ఉద్యోగులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా హౌసింగు ఉద్యోగలు, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు సంఘీభావ దీక్షలు చేపట్టారు. జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు కూడా స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి 10 మంది దీక్షలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటావార్పు చేశారు. దేవనకొండలో నాయీబ్రహ్మణులు భారీ ర్యాలీ చేసి రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఏపీ ఎన్‌జీవోల ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటంతో వినూత్న నిరసన తెలిపారు. సోనియా ఫొటోకు పిశాచి పేరు పెట్టి పొరకలు, వేప ఆకుతో కొట్టుకుంటూ దెయ్యం విడిపించినట్లుగా నటించి ఆకట్టుకున్నారు.
మెరికలై.. మెరుపులై..
Published Thu, Aug 29 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement