అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఐల్యాండ్‌లు, డివైడర్లు అధికారులు, పాలకులకు ఆదాయ వనరులుగా మారాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరంలో ట్రాఫిక్ ఐల్యాండ్‌లు, డివైడర్లు అధికారులు, పాలకులకు ఆదాయ వనరులుగా మారాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పాలకుల సూచనల మేరకు అధికారులు వీటిని ఇష్టమొచ్చిన రీతిలో మార్చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా నాలుగు రోడ్లు ఉన్నాయి. అవి.. రాజు, సుభాష్, చర్చి, ఐరన్ బ్రిడ్జి రోడ్లు.
వీటికి ఇరువైపులా అన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ రోడ్లే కీలకం. రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) నిబంధనల ప్రకారం ప్రధాన కూడళ్లలో డివైడర్‌కు అటూ ఇటు 15 మీటర్లకు పైగా ఉండాలి. దాంతో పాటు ఫుట్‌పాత్‌లు తప్పనిసరి. నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. వాహనాల రద్దీ కూడా అధికమైంది. అయితే.. అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టడం లేదు. ట్రాఫిక్ ఐల్యాండ్‌లు, డివైడర్లను మాత్రం ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది.
చేసిన పనే మూడు సార్లు
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సుభాష్ రోడ్డులోని డివైడర్లను ఉద్యమ కారులు ధ్వంసం చేశారు. అప్పట్లో దాతల సహకారంతో మునిసిపల్ అధికారులు వాటిని పునరుద్ధరించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అవి మళ్లీ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత కొద్దికాలానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి(టీడీపీ) ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు రూ.1.80 లక్షలు ఖర్చు చేసి ఆగమేఘాలపై డివైడర్లను ఏర్పాటు చేశారు. మూడు నెలలు తిరగకుండానే కొత్త పాలకవర్గం కడ్డీలతో కూడిన సిమెంటు డివైడర్ల ఏర్పాటుకు రూ.16.66 లక్షలతో టెండర్లను ఆహ్వానించింది. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు లెస్‌కు దక్కించుకున్నారు.
గోకుల్ షాపు నుంచి బిగ్‌సీ వరకు రూ.6.53 లక్షల అంచనాతో పిలిచిన టెండర్‌ను రూ.5.48 లక్షలకు, బిగ్‌సీ నుంచి టవర్‌క్లాక్ వరకు రూ.5.08 లక్షలతో పిలిచిన టెండర్‌ను రూ.4.91 లక్షలకు ఒకే కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేకుల డివైడర్లకు అటూ ఇటు మూడడుగుల మేర గుంతలు తీసి.. మూడు అడుగుల ఎత్తుతో సిమెంటు డివైడర్లను నిర్మిస్తున్నారు. వాస్తవానికి డివైడర్‌కు ఇరువైపులా రోడ్డు 7.5 మీటర్ల చొప్పున ఉండాలి. మూడడుగుల మేర డివైడర్లే ఆక్రమిస్తుండడంతో ఎక్కడా ఆ మేరకు రోడ్డు కన్పించడం లేదు.
గతంలోనూ ఇంతే
గత పాలకవర్గ హయాంలోనూ నగర సుందరీకరణ పేరుతో రూ.లక్షలు ఖర్చు పెట్టారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ ఇంజనీరు పిచ్చయ్యను తీసుకొచ్చి నగరంలో డివైడర్లు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఐల్యాండుల ఏర్పాటుకు స్కెచ్చు గీయించారు. ఈ మేరకు రూ.లక్షలు ఖర్చు చేసి.. వాటిని నిర్మించారు. అవి ప్లానుకు అనుగుణంగా లేకపోవడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారాయి. దీంతో వాటిని పడగొట్టి కొత్తవి నిర్మించారు. సప్తగిరి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఐల్యాండ్ పెద్దదిగా ఉండడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పట్టించుకోని అధికారులు ప్రస్తుత పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
డివైడర్లు, ట్రాఫిక్ ఐల్యాండ్‌లను పాలకులకు ఆదాయ వనరుగా చూపించి.. తామూ కొంత దిగమింగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి సుభాష్‌రోడ్డు, పాతూరు రోడ్డు జాతీయ రహదారుల శాఖపరిధిలోకి వస్తాయి. చర్చిరోడ్డు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తుంది. వీటిలో అక్రమ కట్టడాలను ఆ శాఖ అధికారులు కూల్చివేయాల్సి ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదు. వాటిని కూల్చకుండా నగర సుందరీకరణ పేరుతో డివైడర్లు, ఐల్యాండ్లలో మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని నగర ప్రజలు అంటున్నారు.
అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం
ప్రజల వినతి మేరకే డివైడర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్‌అండ్‌బీ అధికారుల సహకారంతో రోడ్డు వెడల్పు చేపడతాం. అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం. దీనిపై ఇప్పటికే వారికి లేఖ రాశాం.
- మదమంచి స్వరూప, మేయర్
పాలకవర్గం అనుమతి మేరకే..
పాలకవర్గం, కమిషనర్ అనుమతి మేరకే టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నాం. అన్ని పనులనూ కాంట్రాక్టర్లు అంచనా వ్యయం కంటే తక్కువ మొత్తానికిదక్కించుకున్నారు. నిధుల దుర్వినియోగం ఎక్కడా లేదు.
- మల్లికార్జున, నగర పాలక సంస్థ ఈఈ