సాక్షి, విజయవాడ : టీడీపీ నాయకులు రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకోవడం దురదృష్టకరమని బీజేపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీకి చెందిన నగదు, బంగారం డిపాజిట్లు ఏఏ బ్యాంకులలో ఎంత మేరకు ఉన్నాయో టీటీడీ అధికారులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బంగారంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన రిపోర్ట్‌ను సీఎస్ ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం లోపు రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని, అలా కాకుంటే ఉద్యమం చేపడతామని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం బాధాకరమన్నారు.
1381 కేజీల బంగారాన్ని తమిళనాడు నుంచి తరలిస్తుంటే ఎన్నికల కమిషన్ సీజ్ చేయడం టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమన్నారు. తిరుమలలో వివిధ బ్యాంకులలో 10,500 కోట్ల నగదు, 9535 కేజీల బంగారు నిల్వలు ఉన్నాయని తెలిపారు. శ్రీవారి బంగారంపై టీటీడీ బోర్డ్ సభ్యులు ఈవోను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 400 కోట్ల రూపాయల బంగారంపై టీటీడీ బోర్డు మీటింగులో ఎందుకు చర్చ జరగలేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, టీటీడీ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment