
చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయరు?
ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్ : ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో దోపిడీకి తెర తీస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఉన్న లొసుగులు ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు సంచులు మోసినవారికి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని బొత్స ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనుల్లో దోచుకున్నట్లుగానే భావనపాడులో కూడా మరో దోపిడికి సిద్ధమయ్యారన్నారు. కిరీటాలు ఉత్తరాంధ్రకు కాదని, ఆయన కుటుంబానికే అని అన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్ధాలు ఆడటం ఆపాలని బొత్స సూచించారు. ఇసుక దోపిడీని మొదటే అడ్డుకుని ఉంటే చిత్తూరు జిల్లా ఏడ్పేరు ప్రమాదం జరిగేది కాదని ఆయన అన్నారు.