విశాఖపట్నం: ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కో స్తాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో కురుపాంలో 10 సెం.మీలు, అవనిగడ్డలో 7, భీమడోలు 5, పాలేరు బ్రిడ్జి, మారుటేరులో మూడు సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.