పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం | Will be the development of tourist destinations | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం

Published Mon, Jan 12 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం

పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం

సూళ్లూరుపేట: రాబోయే రోజుల్లో పులికాట్, నేలపట్టు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సూళ్లూరుపేటలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఉదయగిరి ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సినీ నటులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ పండగను ఇంకా బాగా నిర్వహిస్తామని చెప్పారు. పులికాట్ పూడిక తీతకు రూ.75 లక్షలు, నేలపట్టు చెరువు అభివృద్ధికి రూ.75 లక్షలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ అమెరికా కంటే మన దేశానికి పర్యాటకులు చాలా తక్కువగా వస్తున్నారని, అందుకే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి పక్షులు ఇక్కడకు వస్తున్నాయంటే మన ప్రాంతానికే ఇది గర్వకారణమన్నారు. మనవాళ్లు వాటిని ఆదరించి దేవతల్లా పూజిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను మరింత వేడుకలా నిర్వహించాలని కోరారు. అందుకు అవసరమైన వసతి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ పులికాట్ ముఖద్వారాలు పూడిక తీసి మత్స్యకారులకు జీవనోపాధి పెంపొందించాలన్నారు.

తమిళనాడు ప్రభుత్వం మత్స్యకారులకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ టూరిజంను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందన్నారు. అందువల్ల ఇలాంటి అరుదైన ఫెస్టివల్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పేర్నాడు తదితర ప్రాంతాలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్నారు.

నియోజకవర్గంలో నేలపట్టు, బీవీపాళెం, పులికాట్‌లను అభివృద్ధి చేసి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన సెజ్‌లలో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించి మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ మాట్లాడుతూ ఫెస్టివల్‌ను వచ్చే సంవత్సరం బాగా జరపాలంటే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పులికాట్‌ను కాపాడుకునేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు రాజేంద్రప్రసాద్, షార్ డెరైక్టర్ ప్రసాద్‌ను కూడా ఘనంగా సత్కరించారు. మూడు రోజుల ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రుల చేతులగా జ్ఞాపికలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement