సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తావా? ఏపీకి వస్తా.. టీడీపీకి వ్యతిరేకంగా, మిత్రుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తా. మా తడాఖా ఏమిటో చూపిస్తా.’’ అని ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తెహదుల్–ముస్లిమీన్ (మజ్లిస్) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ దారుస్సలాం ఆవరణలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ విజయోత్సవ సభలో ఒవైసీ ప్రసంగించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. సొంత రాష్ట్రంలోనే బాబుకు వ్యతిరేకత ఉందని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా టీడీపీ గెలుచుకోలేదని ఒవైసీ జోస్యం చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసినా టీడీపీ కనీసం ఉనికి చాటలేకపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ, మహాకూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, పలువురు సినీతారలు ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ రాజకీయ ఉద్ధండులు మట్టికరిచారని గుర్తుచేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు ఆదరించారన్నారు. గతంలో మోదీకి మద్దతిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌తో కలసి ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ఫ్రంట్ విఫలమవుతుందని ఒవైసీ పేర్కొన్నారు.
కేసీఆర్‌కు అండగా మజ్లిస్...
దేశానికి బీజేపీయేతర, కాంగ్రెసేతర రాజకీయ పార్టీల కూటమి అవసరం ఉందని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మజ్లిస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ వెంట నడుస్తానన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు అవసరమని, అప్పుడే ప్రాంతీయ అభివృద్ధి కోసం ఓటు విలువ పెరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఏర్పడితే జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతు ఖాయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఏ విధమైన మత ఘర్షణలు జరగకుండా శాంతిభద్రతలు అదుపులో ఉండటం, ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేయడం వల్లే టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో మజ్లిస్ మద్దతు ప్రకటించినట్లు ఒవైసీ తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీలు, దళితులు, బీసీలతోపాటు ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న కేసీఆర్ పాలన ఆదర్శంగా ఉందన్నారు. దాదాపు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్–మజ్లిస్ కలసి 17 సీట్లను క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయోత్సవ సభలో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్ధులు, పార్టీ బాధ్యులు తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment