బీజేపీ తెలంగాణ నేతలు
ఆపడం ఎవరితరమూ కాదు
చర్చకు పట్టుబడతాం.. బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడి
కిషన్‌రెడ్డి, రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తాము ఢిల్లీ నుంచి తిరిగొస్తామని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు పేర్కొన్నారు. ఇక తెలంగాణను ఆపడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో.. పార్టీ జాతీయ నాయకులకు అందుబాటులో ఉండేందుకు సుమారు 40 మంది బీజేపీ తెలంగాణ నేతలు సోమవారం ఢిల్లీ వెళ్లారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఉద్యమ కమిటీ చైర్మన్ టి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా.. బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, టి.ఆచారి, నరహరిరెడ్డి, మురళీధర్‌రావు, ఎన్.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణపై లోక్‌సభలో చర్చకు తమ పార్టీ పట్టుబడుతుందని, అనంతరం జరిగే ఓటింగ్‌లో పాల్గొంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తమ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటోందని, తాము ఆ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. బిల్లుకు తమ పార్టీ నేతలు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. కాగా.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ ఎవరూ నోరు మెదపొద్దని, ఏదైనా చెప్పాల్సివస్తే పార్టీ జాతీయ నేతలే మీడియా ముందుకు వస్తారని కిషన్‌రెడ్డి ద్వితీయశ్రేణి నాయకుల్ని ఆదేశించారు.
కేంద్ర నాయకత్వం అసహనం!
రాష్ట్రం నుంచి పార్టీ నేతలు పదేపదే ఢిల్లీ రావడం పట్ల బీజేపీ జాతీయ నాయకులు పలువురు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మీరందరూ వచ్చి ఎవరి మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నారు? మా పనిలో మేముంటాం. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే బాధపడతారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని పదేపదే మార్చుకోవడం మన పార్టీలో ఉండదు కదా?..’ అని సుష్మాస్వరాజ్ సహా పలువురు నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మా సమస్యలూ పట్టించుకోవాలి: సీమాంధ్రులు
రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలనే కోరుతున్నామని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి చట్టబద్ధత కల్పించాలన్న తమ ప్రధాన డిమాండ్‌పై తమ పార్టీ సభ్యులు పట్టుబడతారని కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు చెప్పారు.
తెలంగాణకు కాంగ్రెస్సే స్పీడ్ బ్రేకర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు స్పీడ్ బ్రేకర్ తాము కాదని, కాంగ్రెస్ పార్టీయే అని బీజేపీ దుయ్యబట్టింది. ఇరు ప్రాంతాల వారితో కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడింది. శాంతియుతంగా తెలంగాణ ఇవ్వాలని, సీమాంధ్రకు న్యాయం చేయలనేది తమ వైఖరి అని, దాని నుంచి తప్పుకోలేదని పునరుద్ఘాటించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీమాంధ్ర, తెలంగాణ బీజేపీ నేతలు హరిబాబు, యెండల లక్ష్మీనారాయణల, శ్రీరామ్ వెధిరెలతో కలసి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. వాజ్‌పేయి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ఒక్క రాష్ట్రాన్ని సరైన రీతిలో ఏర్పాటు చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆ పార్టీ ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
అది ప్రాయోజిత ధర్నా: విద్యాసాగర్‌రావు
రాష్ట్ర సమైక్యత కోసం రామ్‌లీలామైదాన్‌లో జరిగిన ధర్నా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర నేత విద్యాసాగర్‌రావు విమర్శించారు. పార్లమెం టు వెలుపల సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ వెనుకంజ వేసినట్టు ప్రచారం జరగడాన్ని ఖండించారు.
తెలంగాణతోనే తిరిగొస్తాం!
Published Tue, Feb 18 2014 12:21 AM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM
Advertisement
Advertisement