
వీఆర్ఏలకు 15 వేల జీతం ఇప్పిస్తా
మూడేళ్లుగా పోరాటం చేస్తున్న వీఆర్ఏలకు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంఘీభావం తెలిపారు. వచ్చే ఏడాది ఎటూ ఎన్నికల సంవత్సరమేనని, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే వీఆర్ఏలకు రూ. 15 వేల వేతనం కచ్చితంగా ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వీఆర్ఏ నాయకులు, ఆందోళన చేస్తున్న వారు హర్షధ్వానాలతో నిరసన ప్రాంగణాన్ని హోరెత్తించారు.
పక్క రాష్ట్రమైన తెలంగాణలో వీఆర్ఏలకు రూ. 10,700 వేతనం ఇస్తుంటే ఏపీలో మాత్రం చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, దీనిపై మూడేళ్లుగా పోరాడుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం ఎవ్వరి మాటలు వినిపించుకోవడం లేదని, ఆయన చర్మం మందమెక్కి పోయిందని జగన్ మండిపడ్డారు. మనం ఏం చెప్పినా ఆయన చెవికి ఎక్కించుకునే పరిస్థితిలో లేరన్నారు. ఈ ఏడాది, ఏడాదిన్నర కూడా గట్టిగా ప్రయత్నిద్దామని, అయినా చంద్రబాబుతో పనిచేయించుకోలేకపోతే.. ఎన్నికల తర్వాత వచ్చే మనందరి ప్రభుత్వంలో కచ్చితంగా వీఆర్ఏలకు రూ. 15,000 జీతం ఇప్పిస్తానని తెలిపారు. వీఆర్ఏల సంఘం నాయకులతో పాటు సీపీఎం బాబూరావును కూడా పిలిపించుకుని.. మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూస్తానన్నారు. ఎవ్వరూ అధైర్యపడద్దని భరోసా ఇచ్చారు.